Eng vs Pak 1st Test 2024: పాకిస్థాన్‌పై తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ విజయం నమోదు చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 556 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 823-7 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 220 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో పాకిస్థాన్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 500+ పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ ఓడిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. కాగా, ట్రిపుల్ సెంచరీతో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
కాగా, 267 పరుగుల వెనుకంజలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ తేలిపోయింది. మ్యాచ్ కనీసం డ్రా కూడా చేసుకోలేకపోయింది. నాలుగో రోజు చివరిసెషన్లో బ్యాటింగ్ ప్రారంభించగానే వరుసగా వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి 152-6తో నిలిచింది. ఇక ఆఖరి రోజు మరో 68 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కూడా కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4, బ్రైడన్ కర్స్, గస్ అట్కిసన్ తలో 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. జో రూట్ (262 పరుగులు), హ్యారీ బ్రూక్ (317 పరుగులు) భారీ శతకాలతో విరుచుకుపడ్డారు. ఓపెనర్ జాక్ క్రాలీ (78 పరుగులు) రాణించాడు. దీంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ 823 -7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. ఇక తాజా విజయంతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య ఇదే వేదికపై అక్టోబర్ 15న రెండో టెస్టు ప్రారంభం కానుంది.
The first team in Test history to concede over 500 in the first innings, and end up winning by an innings...
— England Cricket (@englandcricket) October 11, 2024
🇵🇰 #PAKvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/N2Ey1dCYVL
స్కోర్లు
- పాకిస్థాన్ : 556-10, 220-10
- ఇంగ్లాండ్ : 823-7 డిక్లెర్డ్
బ్రూక్ ట్రిపుల్, రూట్ డబుల్ సెంచరీ - పాకిస్థాన్ పై రెచ్చిపోయిన ఇంగ్లాండ్ బ్యాటర్లు!
WTCలో రూట్ హవా- కెరీర్లో మరో మైల్స్టోన్- సచిన్ రికార్డుకు అతి చేరువలో - Joe Root WTC