Dhoni 3 Sixes IPL: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సీజన్ ఐపీఎల్లో ఓ సూపర్ స్టార్. గేమ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, బ్యాటింగ్ ఏ పొజిషన్లో దిగాలన్నా సిద్ధంగా ఉంటాడు. ఒత్తిడి తీసుకుంటాడు, ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతాడు. అందుకే ధోనీ సారథ్యంలో 2008 నుంచి 2023వరకూ సూపర్ కింగ్స్ జట్టు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్ వరకూ వెళ్లగలిగింది.
ఇక ప్రస్తుత సీజన్లో రుతురాజ్ కెప్టెన్సీలో ఆడుతున్న ధోనీ కీపర్, బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చి చివరి 4 బంతుల్లో వరుసగా 6, 6, 6, 2 బాదాడు. దీంతో చెన్నై స్కోర్ 200+ దాటింది. ఇక ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లతో స్టేడియం ఊగిపోయింది. మహీ ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్ దొరికేసింది. అయితే ఐపీఎల్లో ధోనీ ఇలా ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు కురిపించడం కొత్తేం కాదు. గతంలోనూ ధోనీ చివరి ఓవర్లో 3 సిక్స్‌లు బాదిన సందర్భాలు ఉన్నాయి. అది ఎప్పుడెప్పుడంటే?
చెన్నై- ఆర్సీబీ (2019)
2019వ సీజన్ 39వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 161 పరుగులు చేసింది. చేధనలో 28 పరుగులకే 4 వికెట్లు పడగొట్టారు బెంగళూరు బౌలర్లు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి దిగిన ధోనీ మ్యాచ్ దశను మార్చేశాడు. అంబటి రాయుడుతో కలిసి సిక్సుల వర్షం కురిపించాడు.
ఇక చివరి ఓవర్లో 26 పరుగులు కావాల్సిన దశలో ధోనీ, తొలి బంతిని బౌండరీ దాటించి తర్వాత వరుసగా రెండు సిక్సులు బాదాడు. దీంతో సమీకరణం 3 బంతుల్లో 10 పరుగులుగా మారింది. నాలుగో బంతికి 2 పరుగులు తీసిన మహీ ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఇక చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా శార్దూల్ ఠాకూర్ రనౌట్ అయ్యాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు గెలిచింది.
చెన్నై- రాజస్థాన్ (2020)
ఐపీఎల్ 2020 నాలుగో మ్యాచ్‌లో చెన్నై దుబాయ్ షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడింది. స్టీవ్ స్మీత్ (69), సంజూ శాంసన్ (74) వీరోచిత పోరాటంతో రాజస్థాన్ 216 భారీ స్కోరు సాధించింది. చేధనలో డుప్లెసిస్ (72) చెలరేగినా ఆఖరి ఓవర్లో 37 పరుగులు కావాల్సి వచ్చింది. దీంతో చెన్నై ఓటమి దాదాపు ఖాయమైంది. కానీ, క్రీజులో ఉన్న ధోనీ ఆ ఓవర్లోనూ 3 సిక్స్‌లు బాది ఓటమి అంతరాన్ని తగ్గించాడు.
చెన్నై- ముంబయి (2024)
వాంఖడే వేదికగా జరిగిన ముంబయి ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ఎంఎస్ ధోనీ అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముంబయి అభిమానులు సైతం ధోనీ బాదుడుకు ఫిదా అయిపోయారు. రుతురాజ్ గైక్వాడ్ (69), శివమ్ దూబె(66) శుభారంభం ఇవ్వగా, ధోనీ చివర్లో 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లు - రోహిత్ సెంచరీ వీడియో - IPL 2024 CSK VS Mumbai Indians
ముంబయిపై సీఎస్కే విజయం - మ్యాచ్‌లో నమోదైన 7 రికార్డులు ఇవే! - IPL 2024 MI VS CSK