Clashes at Football Match In Guinea : పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం జరిగింది. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో అక్కడి వారు కొందరు పరస్పరం దాడి చేసుకోవడం వల్ల దాదాపు 100 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఏం జరిగిందంటే?
గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం కాంట్రవర్సీకి దారి తీసింది. దీంతో దాన్ని వ్యతిరేకించేందుకు ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. అది చూసి అవతలి టీమ్ అభిమానులు ముందుకొచ్చి వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ చెలరేగింది.
ఓ వైపు మ్యాచ్‌లో గందరగోళం జరుగుతుంటే మరోవైపు వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు దిగారు. కొందరేమో పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారింది. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి పరిస్థితి దారుణంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఈ విషయంపై స్థానిక ఆసుపత్రి డాక్టర్ ఒకరు మీడియాతో మాట్లాడారు. దాదాపు 100 మంది మృతిచెందారని ఆయన ఈ మేరకు వెల్లడించారు. ఇకపై మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
జమైకాలో కాల్పులు
గతంలోనూ జమైకాలో విషాదం నెలకొంది. ప్లెజెంట్ హైట్స్ ప్రాంతంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. కింగ్స్టన్ రాజధానిలో అర్థరాత్రి ఫ్రైండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద సంఘటనను జమైకా కాన్స్టాబులరీ ఫోర్స్ సమాచార విభాగం ధ్రువీకరించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో గందరగోళం - ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల అత్యుత్సాహం - Paris Olympics 2024
Red Card In Cricket : క్రికెట్లో రెడ్‌కార్డ్ రూల్.. నిషేధం ఎదుర్కొన్న తొలి ప్లేయర్ అతడే