Chennai Super Kings Ipl 2024: 2024 ఐపీఎల్ ఆరంభంలో వరుస విజయాలతో సునాయసంగా ప్లే ఆఫ్స్ చేరుతుందనుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఇప్పుడు పోరాడుతోంది. ఈ సీజన్ సెకండ్ హాఫ్‌లో 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు నమోదు చేసింది. ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇకపై మిగిలిన చివరి రెండు మ్యాచ్‌ల్లో చెన్నై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి సీజన్ ప్రారంభంలో అదరగొట్టిన చెన్నై సెకండ్ హాఫ్‌లో తడబడడానికి గల కారణాలు ఏంటో తెలుసా?
వేధిస్తున్న గాయాలు: చెన్నై జట్టు లయను ఆటగాళ్ల గాయాలు దెబ్బతీశాయి. స్టార్ పేసర్ మతీషా పతిరణా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం సీఎస్కేను దెబ్బ కొట్టింది. దీంతో పతిరణా ఐపీఎల్ నుంచి మధ్యలోనే శ్రీలంకకు వెళ్లిపోయాడు. దీపక్ చాహర్ కూడా గాయంతో బాధపడ్డాడు. సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్ ఫర్వాలేదనిపిస్తున్నా సీఎస్కే బౌలింగ్ ఇంకా బలహీనంగానే కనిపిస్తోంది!
పేలవమైన ఫామ్: స్టార్ ప్లేయర్లు అజింక్యా రహానే, డేవన్ కాన్వే ఫామ్‌లో లేకపోవడం ప్రతికూలాంశంగా మారింది. ఆల్‌రౌండర్ మోయిన్ అలీ కూడా గుజరాత్‌తో మ్యాచ్‌లో మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక యంగ్ బ్యాటర్ శివమ్ దూబే తొలి ఆరు మ్యాచ్‌ల్లో 163.51 స్ట్రైక్ రేట్‌తో 242 పరుగులు చేశాడు. కానీ, తర్వాతి 6మ్యాచ్‌ల్లో ఏకంగా రెండు డకౌట్లు సహా మూడుసార్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరాడు.
వాళ్లపైనే ఆధారపడడం: జట్టులోని పలువురు ఆటగాళ్లపై చెన్నై ఎక్కువగా ఆధారపడుతోందని చెప్పవచ్చు. రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా త్రయంపై చెన్నై ఆ సీజన్లో ఎక్కువగా ఆధారపడింది. వరుస పరాజయాల్లో టాస్ కూడా ఓ మేరకు కీలక పాత్ర పోషించింది. ఫామ్, గాయాలకు తోడు టాస్ ఓడిపోవడం కూడా చెన్నై విజయాలకు బ్రేక్ పడినట్లైంది. ఇకనైనా పుంజుకొని మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలని చెన్నై ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఒంటిచేత్తో సిక్సర్స్ కొట్టిన స్టార్ క్రికెటర్ - వింటేజ్ ధోనీ ఈజ్ బ్యాక్ - IPL 2024
చెన్నైకి చెక్ - సొంత మైదానంలో గుజరాత్ సూపర్ విక్టరీ - IPL 2024