Bangladesh Allrounder Shakib Al Hassan Retirement : బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. తన టెస్టు కెరీర్ ముగింపు దశకు చేరుకుందంటూ వెల్లడించాడు.మిర్పూర్ వేదికగా తన చివరి టెస్టు ఆడాలని ఉందని, అయితే ఒకవేళ అలా జరగకుంటే మాత్రం ఇప్పుడు భారత్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచే తన చివరదంటూ షకీబ్ పేర్కొన్నాడు.
ఇక కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై టెస్టులో బంగ్లా జట్టు ఘోర ఓటమిని చవి చూసింది. అయితే పాకిస్థాన్‌పై జరిగిన టెస్టు సిరీస్‌ను గెలిచిన జట్టులో షకిబ్ సభ్యుడుగా ఉన్నాడు. కానీ, మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న ఈ స్టార్ క్రికెటర్‌పై ఓ కేసు కూడా నమోదవ్వడం వల్ల అతడ్ని జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా ఎక్కువయ్యాయి. కానీ, ఆ సమయంలోనూ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం షకిబ్‌కు సపోర్ట్ చేసింది.
ఇటీవలే బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో దేశం తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన అతి పెద్ద వయస్కుడిగా షకీబ్ నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో 37 ఏళ్ల 181 రోజుల వయసులో షకీబ్ శనివారం మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో మహ్మద్ రఫీక్ పేరిట ఉన్న రికార్డుని అధిగమించాడు. రఫీక్ 2008లో 37 ఏళ్ల 180 రోజుల వయసులో బంగ్లా తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌కు ప్లేయర్ విల్‌ఫ్రెడ్ రోడ్స్ 1930లో 52 ఏళ్ల 165 రోజుల వయసులో చివరి టెస్టు ఆడిన అత్యంత వృద్ధ క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఆ రికార్డూ ఊరిస్తోంది!
కాగా, సుదీర్ఘ ఫార్మాట్లో 4 వేలకుపైగా పరుగులు, 250+ వికెట్లు తీసిన 5వ ప్లేయర్‌గా నిలిచే ఛాన్స్ ఉంది. షకీబ్ ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో 4575 పరుగులు చేసి, 242 వికెట్లు తీశాడు. మరో 8 వికెట్లు పడగొడితే 250 మైలురాయి అందుకుంటాడు. 2007లో టెస్టు అరంగేట్రం చేసిన షకీబ్ ఒకటిన్నర దశాబ్దానికిపైగా బంగ్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో బంగ్లా సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఫ్యాన్ చెంప చెల్లుమనిపించిన బంగ్లా కెప్టెన్- ఒక్కసారిగా పరుగులు తీసిన అభిమానులు!