Champions Trophy 2025 BCCI PCB Delhi Proposal : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ఐసీసీ టోర్నీకి భారత్ వెళ్లడం దాదాపు కష్టమనే చెప్పాలి. మరోవైపు పాక్ మాత్రం తమ దేశంలోనే ఛాంపియన్స్ నిర్వహిస్తామని ధీమాగా చెబుతోంది. ఈ క్రమంలో బీసీసీఐ ఎదుట పీసీబీ ఓ ప్రతిపాదనను ఉంచిందనే వార్తలూ వస్తున్నాయి. ఇంతకీ అదేంటంటే?
దిల్లీ లేదా చండీగఢ్ ప్రపోజల్ - భద్రతా కారణాల రీత్యా పాక్‌లో భారత జట్టు ఉండేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో భారత్ తన మ్యాచ్ ముగిసిన వెంటనే దిల్లీ లేదా చండీగఢ్‌కు వెళ్లిపోయేలా పీసీబీ ప్రతిపాదన చేసిందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. వాటన్నింటినీ కూడా బీసీసీఐ తిరస్కరించిందని, అసలు పాక్‌లో అడుగు పెట్టేదే లేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. అయితే, పీసీబీ నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొనడం గమనార్హం.
అది ప్రభుత్వ నిర్ణయం - ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు వెళ్లాలా? వద్దా? అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, భారత్ తమ దేశానికి రాదని పాక్ కూడా మానసికంగా సన్నద్ధమైందని కథనాలు వచ్చాయి. దీంతో హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్‌లు పాక్‌లో కాకుండా, తటస్థ వేదికల్లో నిర్వహించడమే హై బ్రిడ్ మోడల్. ఇప్పటికే గత ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించారు.
అదే మా తొలి ప్రాధాన్యం - మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీని పాక్‌లో నిర్వహించడమే తమ తొలి ప్రాధ్యాన్యమని పీసీబీ వర్గాలు తెలిపాయి. భారత ప్రభుత్వం టీమ్ ఇండియాను పాక్‌లో ఆడడానికి అనుమతి ఇవ్వకపోవడం, యూఏఈలో మ్యాచ్‌ల నిర్వహణకు మొగ్గు చూపుతోందని పేర్కొన్నాయి. కానీ పాక్‌లో భారత్ ఆడకపోయినా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మాత్రం లాహోర్‌లోనే గడాఫీ స్టేడియంలోనే నిర్వహించాలని ఐసీసీ కోరుతామని వెల్లడించాయి.
2008లో ముంబయి ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటించడం లేదు. ఇరు జట్లూ ఐసీసీ టోర్నీల్లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతున్నాయి. అదీనూ తటస్థ వేదికలపైనే. ఇప్పుడు ఛాంపియన్స్ లోనూ ఫిబ్రవరి 23న భారత్ - పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇక ఫైనల్‌కు లాహోర్ లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఒకవేళ భారత్ తుది పోరుకు చేరినా అక్కడే నిర్వహించాలనే ఉద్దేశంతోనే పాక్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, టోర్నీలో భారత్ ఆడే ప్రతి మ్యాచ్ కూడా తటస్థ వేదికల్లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.
పాకిస్థాన్ కొత్త కెప్టెన్ అతడే!
రోహిత్ పేరిట మరో చెత్త రికార్డు - ధోనీ, సచిన్, దాదా సరసన హిట్‌మ్యాన్