BCCI Earnings From IPL : క్రీడాభిమానులను ఉత్తేజపరిచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు భారత క్రికెట్ బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తోంది. 2022 సీజన్‌తో పోలిస్తే 2023 ఎడిషన్ వల్లనే 'మిగులు సంపాదన'లో 116 శాతం పెరుగుదల కనిపించినట్లు తాజాగా వెలువడిన పలు నివేదికల్లో స్పష్టమవుతోంది. 2022 ఐపీఎల్‌లో రూ.2,367 కోట్లు ఉండగా, ఆ తర్వాతి ఏడాదికి అది కాస్త రూ.5,120 కోట్లకు చేరింది. అలాగే ఐపీఎల్ 2023 ఎడిషన్ ఆదాయం రూ.11,769 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతకుముందిటి ఏడాదితో పోలిస్తే ఇప్పుడే 78 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అయితే అటు ఖర్చులు కూడా 66 శాతం పెరిగి రూ.6,648 కోట్లకు చేరాయని తెలుస్తోంది.
ముఖ్యంగా ఐపీఎల్ టెలికాస్టింగ్ రైట్స్, స్పాన్సర్‌షిప్స్ వల్లే భారీగా మిగులు కనిపించినట్లు క్రికెట్ వర్గాల మాట. 2023-27 సీజన్ కోసం మీడియా హక్కుల ద్వారానే బీసీసీఐకి సుమారు రూ.48,390 కోట్లు వచ్చాయి. ఇందులో ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు (స్టార్ స్పోర్ట్స్) ద్వారా రూ.23,575 కోట్లు, అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్ (జియో సినిమా)తో రూ. 23,758 కోట్లు దక్కించుకుంది. మరోవైపు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులను ప్రముఖ టాటా సన్స్ రూ. 2,500 కోట్లకు తీసుకుంది.
'రిటెన్షన్' రూల్‌పై క్లారిటీ అప్పుడే!
ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2025 సీజన్ కోసం మరికొద్ది నెలల్లో మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ గ్రాండ్‌గా సన్నాహాలు చేస్తోంది. అయితే, అంతకుముందే ప్లేయర్లకు సంబంధించిన రిటెన్షన్ రూల్‌పై ఓ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. గతంలో ఫ్రాంచైజీలు, అలాగే బీసీసీఐ మెంబర్స్‌కు మధ్య మీటింగ్ జరగ్గా, అందులో ఫ్రాంచైజీలన్నీ తమ వద్ద ఆరుగురు ప్లేయర్లను (రైట్ టు మ్యాచ్) అట్టిపెట్టుకొనేలా బీసీసీఐ ఎదుట ఓ ప్రపోజల్‌ను ఉంచినట్లు సమాచారం. దీనికి బోర్డు కూడా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ఫ్రాంచైజీలైతే తమకు ఈ మెగా వేలం అస్సలు వద్దంటూ కోరినట్లు సమాచారం.
రూ.120కోట్ల పర్స్ వ్యాల్యూ- రిటెన్షన్ ఆప్షన్లో మార్పు- IPL 2025 మెగా వేలం! - IPL 2025 Mega Auction