Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం క్రికెట్‌ను తాకింది. దేశంలో ప్రభుత్వ మార్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జలాల్ యూనుస్ తన పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆపరేషన్స్ ఛైర్మన్ పదవి నుంచి కూడా తక్షణమే వైదొలుతున్నట్లు వెల్లడించారు. గత కొద్ది రోజులగా దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా యూనస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే బీసీబీ అధ్యక్షుడు కూడా!
బంగ్లాదేశ్ క్రికెట్ ప్రయోజనాల కోసం తాను బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని యూనస్ ఓ ప్రముఖ ఛానల్‌కు తెలిపారు. బంగ్లాదేశ్ హసీనా సర్కార్ కుప్పకూలి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ క్రికెట్ బోర్డు నుంచి వైదొలిగిన తొలి డైరెక్టర్ యూనసే. మరోవైపు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ కూడా త్వరలో రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. దేశ క్రికెట్ ప్రయోజనాలు, కొత్త ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
T20 వరల్డ్‌కప్‌పై బంగ్లా అల్లర్ల ఎఫెక్ట్
అయితే ఈ ఏడాది జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా, బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశంలో మహిళల వరల్డ్ కప్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ బంగ్లాలో ప్రపంచకప్ నాటికి పరిస్థితులు మారకపోతే ఆ దేశం నుంచి వేదికను మార్చే అవకాశం లేకపోలేదు. శ్రీలంక, యూఏఈలో ఏదైనా దేశాన్ని ఎంచుకోవచ్చు.
మరోవైపు, మరికొద్ది పాకిస్థాన్ పర్యటనకు బంగ్లాదేశ్ వెళ్లనుంది. దాయాది దేశంతో రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 21న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
పాకిస్థాన్ టెస్టు సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహీద్ రనాసన్ , షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్.
T20 వరల్డ్‌కప్‌పై బంగ్లా అల్లర్ల ఎఫెక్ట్- టోర్నమెంట్ ఆ దేశానికి షిఫ్ట్! - Womens T20 World Cup 2024