Ball Hit Bowlers Face : అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఓ ఆందోళనకరమైన ఘటన జరిగింది. బంతి బలంగా తగలడం వల్ల సౌతాఫ్రికా పేసర్ కార్మి లే రౌక్స్‌కు దెబ్బ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది చూసి క్రీజులో ఉన్న ప్లేయర్లు హుటాహుటిగా అతడి వద్దకు పరుగులు తీశారు.
ఇక రౌక్స్ ముఖం నుంచి రక్తం కారడం వల్ల దెబ్బ తీవ్రంగా తలిగినట్లు తెలుస్తోంది. కానీ కొంతసేపటికే రౌక్స్ స్పృహలోకి వచ్చి పైకి లేచాడు. అంతే కాకుండా అతడే స్వయంగా డగౌట్‌కు నడిచి వెళ్లాడు. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటన రెండు రోజుల కిందట జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
మేజర్ లీగ్ క్రికెట్లో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సీటెల్ ఆర్కాస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో యూనికార్న్స్ జట్టు బౌలర్ రౌక్స్ 3వ ఓవర్ వేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటరైన రైన్ రికెల్టన్ షాట్ కొట్టాడు. అయితే, ఆ బంతి నేరుగా వచ్చి దగ్గర్లో ఉన్న రౌక్స్ ముఖానికి తగిలింది. దీంతో బాధతో విలవిల్లాడుతూ అతడు అక్కడే కుప్పకూలిపోయాడు.
ఇది చూసి సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని రౌక్స్‌కు ఫస్ట్‌ఎయిడ్ చేశారు. కాసేపటికే తేరుకున్న రౌక్స్ స్వయంగా మైదానాన్ని వీడాడు. దీంతో ఆ ఓవర్‌ను కోరె అండర్సన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం రౌక్స్ పరిస్థితి ఫర్వాలేదని తాజాగా ఎంఎల్‌సీ పేర్కొంది.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. రక్తం మడుగులో రౌక్సీని చూసి నెటిజన్లు షాకయ్యారు. రౌక్స్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 'గెట్ వెల్ సూన్ ఛాంప్', 'విష్ యు ఓ స్పీడీ రికవరీ' అంటూ కామెంట్లు పెడుతున్నారు. దెబ్బ తీవ్రంగా తగిలినా కూడా అతడు నడుచుకుని వెళ్లిన తీరును చూసి ఆశ్చర్యపోతున్నారు. గాయం త్వరగా మానిపోవాలని ప్రార్థిస్తున్నట్లు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.
అభిమాని మెడ పట్టుకుని ఈడ్చిన స్టార్ క్రికెటర్! - Shakib Al Hasan
'ఆ గాయం నన్ను నిరాశకు గురి చేసింది'- ఫిట్‌నెస్‌పై హార్దిక్ ఎమోషనల్ పోస్ట్ - India Tour To Srilanka