Ashwin England Series : తల్లి అనారోగ్యం కారణంగా మ్యాచ్‌లకు దూరమైన టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ తిరిగి జట్టులోకి రానున్నట్లు తాజాగా బీసీసీఐ వెల్లడించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఆటకల్లా అతడు జట్టులోకి రానున్నట్లు పేర్కొంది.
"కుటుంబంలో అత్యవసర పరిస్థితి నెలకొన్న కారణంగా మ్యాచ్‌లకు విరామం తీసుకున్న ఆర్.అశ్విన్ తిరిగి నేడు జట్టుతో కలవనున్న విషయాన్ని చెప్పేందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మ్యాచ్ రెండో రోజు అత్యవసర పరిస్థితుల కారణంగా అతడు జట్టును వీడిన విషయం తెలిసిందే. అశ్విన్ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని జట్టు యాజమాన్యం, ప్లేయర్లు, మీడియా, అభిమానులు అతడికి అండగా నిలిచారు. ఈ కష్ట సమయంలో సహచరులు కూడా సమష్టిగా మద్దతు ఇచ్చారు. అతడికి మేనేజ్‌మెంట్ మైదానంలోకి తిరిగి స్వాగతం పలుకుతోంది" అంటూ బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
-
🚨 UPDATE 🚨: R Ashwin set to rejoin #TeamIndia from Day 4 of the 3rd India-England Test.#INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/rU4Bskzqig
— BCCI (@BCCI) February 18, 2024
Ashwin 500 Wickets Test: ఇటీవలే తాను తీసిన 500వ వికెట్ల ఘనతను తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో జాక్ క్రాలీని ఔట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. దీంతో అశ్విన్ టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్ 800 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక భారత్ నుంచి అనిల్ కుంబ్లే (619 వికెట్లు) ఒక్కడే ఆశ్విన్ కంటే ముందున్నాడు.
"నా కెరీర్లో టెస్టు క్రికెట్ సుదీర్ఘ ప్రయాణం. ఈ రికార్డు (500వ వికెట్)ను నా తండ్రికి అంకితమిస్తున్నా. నా లైఫ్‌లో చాలా కష్టపడ్డ. మా నాన్న ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉన్నాడు. 500 వికెట్ల మార్క్ అందుకోవడం హ్యాపీగా ఉంది. ఆటలో మేం ప్రస్తుతానికి బ్యాలెన్స్‌గానే ఉన్నాం" అని మ్యాచ్ తర్వాత అశ్విన్ చెప్పాడు.
ఇక అశ్విన్ 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్లో బౌలర్‌గానే కాకుండా, బ్యాట్‌తోనూ అశ్విన్ రాణించాడు. ఇప్పటివరకూ 98 టెస్టులు ఆడిన అశ్విన్ 23.95 సగటుతో 500 వికెట్లు నేలకూల్చాడు. ఇందులో 8సార్లు 10+, 34సార్లు 5+ వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక బ్యాట్‌తోనూ రాణిస్తూ ఇప్పటిదాకా 3308 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి.
వికెట్ నెం.500- టెస్టుల్లో 'అశ్విన్' ఘనమైన రికార్డ్
టెస్టుల్లో అశ్విన్ మాయజాలం - ఆ మైల్స్టోన్ దాటిన 9వ బౌలర్‌గా రికార్డు