Aman Sehrawat Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పురుషల రెజ్లింగ్ కాంస్య పోరులో 21 ఏళ్ల అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు. 57 కిలోల విభాగంలో ప్యూర్టోరికోకు చెందిన దరియన్ టోయ్ క్రజ్ను 13-5తో ఓడించి చరిత్రకెక్కాడు.
ఆ రికార్డులో సింధును దాటి
ఒలింపిక్స్ బరిలో భారత్ తరఫున బరిలోకి దిగిన ఏకైక పురుష ప్లేయర్ అమన్. అయితే ఈ అబ్బాయి ఈ ఒలింపిక్స్‌లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన అతి పిన్న వయస్సు గల భారత అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు. అయితే అమన్కంటే ముందే ఈ రికార్డును బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె రజతం గెలిచినప్పుడు తన వయసు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు.
#AmanSherawat 🇮🇳 who is just 21 years old; wins bronze medal at the men's 57kg #wrestling
— Bhwani Shankar (@BhwaniShankar1) August 9, 2024
The first INDIAN to do so; is always a special feeling !
🥉🥉🥉#Paris2024 #IndiaAtOlympics pic.twitter.com/vdGHZwCuIY
ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ప్రస్థానం
ఒలింపిక్‌లో పతకం సాధించిన తొలి భారత రెజ్లర్ కేడీ జాధవ్. 1952 (హెల్సింకి)లో అతడు కాంస్యం గెలిచాడు. స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన తొలి ఆటగాడు కూడా ఆయనే. ఆ తర్వాత 2008 నుంచి రెజ్లింగ్‌లో క్రమం తప్పకుండా ఒక్క మెడలైనా సాధిస్తున్నారు మన రెజ్లర్లు. అయితే ఈ సారి ఆ రికార్డు చెరగనివ్వకుండా అమన్ కాపాడాడు. తన మెడల్‌తో ఆ క్రమాన్ని కొనసాగించినట్లు అయ్యింది. 2008లో సుశీల్ కుమార్ కాంస్యం ముద్దాడగా, ఆ తర్వాత 2012లో యోగేశ్వర్ దత్ (కాంస్యం), 2016లో సాక్షి మలిక్ (కాంస్యం) 2020లో రవి దహియా (రజతం),బజ్‌రంగ్ పునియా (కాంస్యం) సాధించారు. 2012లోనూ సుశీల్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు.
ఆఖరి రెజ్లర్ ఆమెనే
అమన్ విజయంతో భారత్, టోక్యో ఒలింపిక్స్ పెర్ఫామెన్స్ (7 పతకాలు)కు చేరువైంది. అయితే నిషా (68 కేజీ), అన్షు మలిక్ (57 కేజీ), అంతిమ్ ఫంగాల్ (53 కేజీ), తమ తమ విభాగాల్లో పోరాడినప్పటికీ పతక రౌండ్లకు చేరలేకపోయారు. ఇక వినేశ్ ఫైనల్‌కు చేరినప్పటికీ అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైంది. ఇక శనివారం (ఆగస్టు 10)న రీతిక 76 కేజీల విభాగంలో దిగనుంది. బరిలో మిగిలి ఆఖరి భారత రెజ్లర్ కూడా ఆమెనే కావడం విశేషం.