Yogini Ekadashi 2024 : యోగిని ఏకాదశి జులై 01 ఉదయం 10:26 గంటల నుంచి జులై 02 ఉదయం 8:42 గంటల వరకు ఉంటుంది. కాబట్టి జులై 02 వ తేదీనే యోగిని ఏకాదశిని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
యోగిని ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించవచ్చు?
యోగిని ఏకాదశి మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆచరించవచ్చు.
యోగినీ ఏకాదశి వ్రత నియమాలు
యోగిని ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే తలారా స్నానం చేసి శుచియై పూజా మందిరం శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణుల విగ్రహాలకు కానీ చిత్రపటాలకు కానీ గంధం కుంకుమలతో బొట్లు పెట్టి సుందరంగా అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. చామంతి, గులాబీ పూలతో లక్ష్మీనారాయణులను అర్చించాలి. పూజలో ముఖ్యంగా తులసి దళాలను సమర్పించాలి. తులసి లేని పూజ అసంపూర్ణం అవుతుంది. ఆవు నేతితో చేసిన చక్కెర పొంగలి ప్రసాదాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రసాదాన్ని అందరికి పంచి పెట్టాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఆరోగ్య కారణాలతో ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు.
దేవాలయంలో ఇలా
ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత సమీపంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. ఈ రోజు పేదలకు అన్నదానం చేస్తే నారాయణుడు సంతృప్తి చెందుతాడని శాస్త్రవచనం.
సాయంత్రం పూజ
సాయంత్రం స్నానం చేసి ఇంట్లో దేవుని ముందు దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే ఎంతో ఫలప్రదం. ఉండగలిగిన వారు ఈ రోజు జాగారం చేస్తే కూడా పుణ్యం.
ద్వాదశి పారణ
పక్క రోజు ఉదయం అంటే జులై 3వ తేదీ ఉదయం ద్వాదశి ఘడియలు రాగానే అభ్యంగ స్నానము చేసి లక్ష్మీనారాయణుల పూజ యధావిధిగా చేసి నైవేద్యం సమర్పించి నమస్కరించుకోవాలి. ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సంతృప్తి పరచి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత ఉపవాసం ఉన్నవారు భోజనం చేసి ఏకాదశి వ్రతాన్ని విరమించవచ్చు. ఈ రోజు బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి.
యోగిని ఏకాదశి వ్రత కథ
పాండవ అగ్రజుడు ధర్మరాజు ఓసారి శ్రీకృషుని యోగిని ఏకాదశి కథ చెప్పమని అడిగాడట! అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు యోగిని ఏకాదశి కథను ఇలా చెప్పాడు.
అల్కాపురిని పరిపాలించే కుబేరుడు పరమ శివ భక్తుడు. అతని సేవకుడు హేమాలి ప్రతిరోజూ కుబేరుని నిత్య పూజ కోసం మానస సరోవరం నుంచి దేవత పుష్పాలను తీసుకొస్తూ ఉండేవాడట! ఒకరోజు హేమాలి తన భార్య మోజులో పడి కుబేరుని పూజకు పూలు తీసుకుని రావడం మర్చిపోయాడట! అప్పుడు కుబేరుడు భగవంతుని పూజ పట్ల హేమాలి నిర్లక్ష్యానికి ఆగ్రహించి శపించాడట.
కుబేరుని శాపం ఫలితంగా హేమాలి భార్యకు దూరమై, కుష్టు వ్యాధిగ్రస్తుడై భూలోకానికి చేరుకుంటాడు. హేమాలి భూలోకంలో మార్కండేయ మహర్షి వద్ద తన కష్టాన్ని చెప్పుకొని శాపవిమోచనం అడుగుతాడు. అప్పుడు మార్కండేయ మహర్షి హేమాలి చేసిన పాపానికి పరిహారంగా యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని సూచిస్తాడు. యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతాడు. మార్కండేయ మహర్షి ఆదేశం మేరకు హేమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాపవిముక్తి పొందుతాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ కథ చెబుతాడు.
యోగిని ఏకాదశి వ్రత ఫలం
నియమ నిష్టలతో యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఈ జన్మలో తెలిసో తెలియకో చేసిన పాపాలు పరిహారం అవుతాయి. అంతే కాకుండా పూర్వ జన్మల పాపాలు కూడా పోతాయని శాస్త్రవచనం. మరో ముఖ్యమైన విషం ఏమిటంటే యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు భయంకరమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. మరణించిన తర్వాత మోక్షాన్ని పొందుతారని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.
రాబోయే యోగిని ఏకాదశి రోజు మనం కూడా ఉపవాస పూజలతో లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందుదాం.
జై శ్రీమన్నారాయణ! ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
విష్ణుమూర్తే కాదు, శివుడు కూడా 10 అవతారాలు ఎత్తారు- వాటి గురించి తెలుసా? - Shiva Avatars Names