Why Do We Offer Grass To Ganesha : వినాయకుడికి పత్రి పూజ అంటే ఇష్టం. అందునా గరిక అంటే చాలా ఇష్టం. ఏ శుభకార్యమైనా, ఎంత గొప్ప కార్యక్రమమైనా ఆరంభ పూజ గణపతికే! గరిక లేకుండా గణపతి పూజ అసంపూర్ణమే! కొంచెం గరికతో వినాయకుని పూజిస్తే తప్పకుండా పూజాఫలం దక్కుతుందని శాస్త్ర వచనం.
వినాయకుడికి గరిక అంటే ఎందుకంత ప్రీతి! పౌరాణిక గాథ
పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అగ్ని పుట్టించి లోకాలన్నిటినీ తన దావానలంతో దహించి వేయసాగాడు. అనలాసురుని కారణంగా ఏర్పడిన వేడిమిని భరించలేని దేవతలందరూ పార్వతి నందనుని వద్దకు వచ్చి అనలాసురిని బారి నుంచి కాపాడమని వేడుకున్నారంట. అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెంచి ఆ అనలాసురుని మింగేసాడంట! అనలాసురుని పీడ విరగడైనందుకు దేవతలంతా సంతోషించారు. కానీ ఇక్కడ అనలాసురుని మింగిన గణపయ్య శరీరం నుంచి విపరీతమైన అగ్ని పుట్టి గణపతి శరీరం మంటలు పుట్టసాగింది.
విఫలమైన దేవతల ప్రయత్నాలు
గణపతి శరీరంలో మంటలు తగ్గడానికి సాక్షాత్తు చంద్రుడు వచ్చి తలపై కూర్చున్నాడంట! అయినా మంట తగ్గలేదు. ఇక గణపయ్య శరీరంలో మంటలను తగ్గించడానికి దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేసారు. విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇస్తాడు. పరమశివుడు తన మెడలోని పామును గణేశుని బొజ్జ చుట్టూ చుడతాడు. ఎన్ని పరిచర్యలు చేసినా గణపతి శరీరంలో మంటలు తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు ఘనాపాటి సమర్పిస్తే గణపతి శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పడం వల్ల 21 గరిక పోచలు గణేశుని తలపై ఉంచగానే వినాయకుని శరీరంలో మంటలు తగ్గి ఉపశమనం కలుగుతుంది.
గణేశుని వరం
గరికపోచలతో శరీరంలో మంటలు తగ్గగానే గణేశుడు ఎవరైతే తనను గరికపోచలతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని, వారి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని వరమిస్తాడు. అంతే కాదు ఏ పని అయినా ఆరంభించేటప్పుడు, శుభకార్యాల సమయంలో గణపతిని గరికతో ఆరాధిస్తే చేసే పనుల్లో విఘ్నాలు ఉండవని కూడా గణపతి వరమిస్తాడు.
ఈ రోజుల్లో గరిక పూజ సర్వ శ్రేష్టం
గణపతికి ప్రధానమైన బుధవారం, చవితి తిథుల్లో ఇంకా ఆదివారం రోజు గణపతికి గరిక సమర్పిస్తే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. అంతేకాదు ముఖ్యమైన పనులు ప్రారంభించేముందు గణపతికి గరిక సమర్పిస్తే చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సర్వ కార్య సిద్ధి కలుగుతుందని శాస్త్ర వచనం.
ఓం శ్రీ గణాధిపతయే నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.