Deepavali 2024 Date Telugu: మనకెన్ని పండగలైనా ఉన్నా సరే.. దీపావళి మాత్రం ప్రత్యేకంగా జరుపుకొంటాం. దేశవ్యాప్తంగా ప్రతి ఇల్లూ దీపాల వెలుగులో కళకళలాడిపోతూ.. చిన్నా పెద్దా అంతా కలిసి సందడి చేస్తుంటారు. పండగ నాడు ప్రతి ఇంటా.. లక్ష్మీ పూజ, బాణసంచా మోతలు దద్దరిల్లిపోతాయి. అయితే.. ఈ ఏడాది దీపావళిని ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో నెలకొంది. ఏటా దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా చేసుకుంటారు. మరి.. ఆ తిథి ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 31నా? లేక నవంబర్ 1వ తేదీనా? అనేదానిపై ప్రజల్లో స్పష్టత లేదు. మరి పంచాంగం ప్రకారం ఏ రోజు జరుపుకోవాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మనలో చాలా మంది అమావాస్య ఘడియలు ఉన్న సాయంత్రం రోజునే పరిగణనలోకి తీసుకోని.. సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తుంటారు. అయితే.. ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉండడంతో చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో దీనిపై జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ స్పష్టత ఇస్తున్నారు. ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 31 గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆరోజున దీపావళి జరుపుకోవాలని తెలుపుతున్నారు.
అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 మధ్యాహ్నం నుంచి నవంబర్ 1 శుక్రవారం రోజు సాయంత్రం 6.15 వరకు ఉన్నా.. ఆ రోజు దీపావళి జరుపుకోకూడదని వివరిస్తున్నారు. ఎందుకంటే దీపావళి సాయంత్రానికి అమవాస్య తిథి ఉండటం ముఖ్యం. ఈ లెక్కన శుక్రవారం రాత్రి పూట అమావాస్య వ్యాపించి లేనందున నవంబర్ 1వ తేదీన దీపావళి జరుపుకోకూడదని చెబుతున్నారు. కాబట్టి.. అక్టోబర్ 31న గురువారం సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉండడంతో ఆ రోజునే ఉదయం నరక చతుర్థశి జరుపుకోవాలని.. సాయంత్రానికి అమావాస్య తిథి వస్తుండడంతో అదే రోజు రాత్రి దీపావళి జరుపుకోవాలని సలహా ఇస్తున్నారు.
Note: పైన తెలిపిన వివరాలు కొందరు జోతిష్య నిపుణులు, జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
దీపావళి రోజు ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి? - ఈ విషయాలు మీకు తెలుసా?
కొబ్బరికాయకు నిత్యపూజ- 108 గవ్వలతో అష్టోత్తరం- లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే చేయాల్సిన పనులివే!