Kashi Vriddha Aditya Mandir : ఆధ్యాత్మిక వాసులకు చివరి మజిలీగా భావించే కాశీ పుణ్య క్షేత్రంలో చూడాల్సిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, డుంఠి గణపతి, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడి మందిరాలను భక్తలు తప్పక సందర్శిస్తారు. ఇటువంటి గొప్ప గొప్ప ఆలయాలు కాశీ క్షేత్రాన్ని మరింత పావనం చేస్తున్నాయి. అయితే ఇదే క్షేత్రంలో వెలసిన ద్వాదశ ఆదిత్యుల గురించి మీకు తెలుసా? అందులో ఒకటైన వృద్ధాదిత్యుని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
12 విశేషమైనవే!
వారణాశిలో సూర్యభగవానుడు కొలువైన 12 దేవాలయాలు విశేషమైనవిగా స్థలపురాణం చెబుతోంది. అలా పూజలు అందుకునే ఆదిత్యులలో వృద్ధాదిత్యుడు ఒకరు.
వృద్ధాదిత్యుని ఆలయ స్థల పురాణం
పూర్వకాలంలో 'హారితుడు' అనే భక్తుడు ప్రతినిత్యం సూర్యభగవానుని పూజిస్తూ ఉండేవారట. కాలక్రమంలో వృద్ధుడైన హారితునికి అప్పటివరకు చేసిన సూర్య ఆరాధనతో సంతృప్తి కలుగలేదంట! ఇంకా ఇంకా సూర్యుని ఆరాధించాలన్న తపనతో ఆయన తనకు యవ్వనాన్ని ప్రసాదించాలంటూ సూర్య దేవుని కోసం కఠోర తపస్సు చేశారు.
హారితుని తపస్సుకు మెచ్చి సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతారు. అప్పుడు హారితుడు సూర్య ఆరాధన కోసం తనకు యవ్వనాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. దీంతో సూర్యుడు ఆయనకు యవ్వనాన్ని ప్రసాదిస్తారు. ఆ ప్రాంతంలో వృద్దునిచే పూజలందుకున్న ఆదిత్యుడు గనుక అక్కడి సూర్యునికి వృద్ధాదిత్యుడు అనే పేరు వచ్చింది.
వృద్ధాదిత్యుని దర్శన ఫలం
కాశీలో వృద్ధాదిత్యుని దర్శించుకున్న వారికి ఈతి బాధలు, మొండి వ్యాధులు నశిస్తాయి. అంతేకాదు ఈ స్వామిని ఏటువంటి కోరిక కోరుకున్నా అది మూడు నెలల్లోనే నెరవేరుతుందని శాస్త్రవచనం. అందుకే కాశీకి వెళ్ళినవారు తప్పకుండా ఈ వృద్ధాదిత్యుని దర్శించుకుని మంచి ఆరోగ్యంతో పాటు అభీష్టసిద్ధిని పొందండి. ఓం సూర్యదేవాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఈ దేవుడిని పూజిస్తే భయంకరమైన వ్యాధులు కూడా నయం! ఎక్కడుందో తెలుసా? - Vimal Aditya Temple Kashi