Vastu Tips for Placing Mirrors in House : వాస్తు ప్రకారం ఇంట్లో అమర్చిన అద్దం ద్వారా ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసరిస్తుందట. అందుకే ఇంట్లో అద్దం ఉంచేటప్పుడు దాని దిశలో ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు వాస్తు నిపుణులు. మిర్రర్‌ను వాస్తుప్రకారం ఉంచిన ఇంట్లో ఐశ్వర్యం, సుఖసంతోషాలు పెరుగుతాయని, పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ వాస్తు ప్రకారం.. ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలి? ఏ పరిమాణంలో ఉండాలి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇంట్లో అద్దం వాస్తుప్రకారం ఉంచడం ద్వారా.. దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మీ ఇంట్లో నైరుతి దిశలో బాత్రూమ్ ఉంటే అద్దం తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తు పండితులు. అది కూడా చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండే అద్దం పెట్టాలట. ఇలా చేయడం వల్ల మీ ఇంటి వాస్తు దోషాలు త్వరగా తొలగిపోతాయని చెబుతున్నారు.
వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో అద్దాన్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో గోడకు అమర్చడం మంచిదట. ఈ దిక్కుల్లో అద్దం పెట్టడం శుభప్రదమని చెబుతున్నారు. ముఖ్యంగా కుబేర దిక్కు అయిన ఉత్తర దిశలో అద్దాన్ని ఉంచినప్పుడు అది పాజిటివిటీతో డబ్బును ఆకర్షిస్తుందట. అలాగే.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుందనీ చెబుతున్నారు. వాస్తుప్రకారం అద్దాలను ఎప్పుడూ దక్షిణం, పశ్చిమ దిశల్లో గోడకు అమర్చకూడదని సూచిస్తున్నారు. ఈ దిశల్లో గోడకు అద్దం అమర్చడం వల్ల ఆ ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుందంటున్నారు నిపుణులు. అదేవిధంగా వాస్తుప్రకారం అద్దం ఎప్పుడూ వృత్తాకారం లేదా దీర్ఘచతురస్త్రాకారంలో ఉండేలా చూసుకోవడం మంచిది అంటున్నారు వాస్తు పండితులు.
వాస్తు ప్రకారం మీ ఇంట్లో డస్ట్‌బిన్ సరైన దిశలో ఉందా? - లేదంటే ఆర్థిక కష్టాలు వస్తాయట!
వాస్తుప్రకారం అద్దానికి సంబంధించి మరికొన్ని టిప్స్ :
- వాస్తు ప్రకారం.. ఇంట్లో ఎక్కడైనా పగిలిన అద్దం ఉంటే వీలైనంత త్వరగా తొలగించాలి.
- ఎందుకంటే పగిలిన అద్దం ఉండటం వల్ల వాస్తు దోషాలు వస్తాయంటున్నారు నిపుణులు.
- బెడ్రూమ్లో మంచానికి ఎదురుగా అద్దాన్ని ఉంచుకోవడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదట. ఎందుకంటే మంచంపై పడుకున్న మనుషుల ప్రతిబింబాలు అద్దంలో కనిపించకూడదు. ఈ విధంగా ఉంటే నెగెటివ్ ఎనర్జీని సృష్టించడమే కాకుండా సంబంధబాంధవ్యాలు దెబ్బతింటాయట.
- అలాగే అద్దం లేదా గాజు ఫ్రేమ్ వాస్తు ప్రకారం చాలా ప్రకాశవంతమైన కలర్లో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ప్రోత్సహించే అవకాశం ఉంటుందట.
- అందువల్ల ముదురు రంగులకు బదులుగా.. లేత, సున్నితమైన రంగులను ఉపయోగించడం మంచిది అంటున్నారు నిపుణులు.
- అదేవిధంగా వాస్తు ప్రకారం ఎరుపు, ముదురు నారింజ లేదా ముదురు గులాబీ రంగు ఫ్రేమ్‌లను యూజ్ చేయకపోవడం బెటర్ అని సూచిస్తున్నారు.
- వాటికి బదులుగా, తెలుపు, క్రీమ్, ఆకాశం, లేత నీలం, లేత ఆకుపచ్చ, గోధుమ రంగు మొదలైన రంగులను ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ ఉంది? - వాస్తు ప్రకారం ఏ దిశలో ఉండాలో తెలుసా?