Vastu Tips For Building New House : సొంత ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం కట్టుకున్న ఇంట్లో సిరిసంపదలతో పదికాలాల పాటు చల్లగా ఉండాలంటే, గృహ నిర్మాణం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. నూతన గృహానికి శంకుస్థాపన చేసే ముందు విఘ్నేశ్వరుని తలుచుకొని పునాదులు వేయడం మొదలుపెట్టాలి. ఇంటికి పునాదులు వేసేటప్పుడు శాస్త్రరీత్యా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వాస్తు మాసాలు పాటించాలి
వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యుని చుట్టూ నలు దిక్కులా సూర్య భ్రమణం 360 రోజుల పాటు జరిగే సమయంలో ఒక్కో దిక్కులో 30 రోజులపాటు తేజస్సు ఉంటుంది. దీనినే గమన తేజస్సు అంటారు. ఇది 60రోజుల పాటు ఉంటే అశుభంగా చెబుతారు. అందుకే ఒక్కో దిక్కులో 30 రోజుల గమన తేజస్సును శుభంగా చెబుతారు. కనుక ఈ గమనాన్నే మనం లెక్కలోకి తీసుకోవాలి. సూర్య గమన తేజస్సును లెక్కలోకి తీసుకున్నప్పుడు మనకు సంవత్సరం మొత్తం మీద కేవలం నాలుగు నెలలు మాత్రమే గృహనిర్మాణం ప్రారంభించడానికి అనువైన సమయంగా వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. వీటినే వాస్తు మాసాలని అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అయిన తర్వాత వచ్చే మాఘ మాసం, వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం. ఈ నాలుగు మాసాలే గృహ నిర్మాణానికి అనువైన మాసాలు.
ఇల్లు కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు
ఇంటికి పునాదులు తీసేటప్పుడే ఎక్కడ ఖాళీ స్థలం వదలాలి, ఎంత వదలాలనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకసారి పునాదులు తీసిన తర్వాత ఖాళీ స్థలం విషయంలో మార్పులు చేయడం కష్టం. ఇంటికి పడమర వైపు కన్నా తూర్పు వైపు ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. ఈ స్థలం ఎంత వదలాలనేది మనకుండే స్థలం సైజును బట్టి, అందులో ఎంత భాగంలో ఇంటి నిర్మాణం చేస్తున్నామనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటి చుట్టూ ఉండే ఖాళీ స్థలం పట్ల ఈ నియమాలు పాటిస్తే, ఆ ఇంట్లో నివసించే వారికి మంచి యోగం కలుగుతుంది. అయితే 40 అడుగులు, అంతకన్నా తక్కువ వెడల్పు పొడుగు ఉండే స్థలంలో ఈ నియమాలు వర్తించవు.
గృహంలో బ్రహ్మస్థానము
ఇంటి స్థలంలో అత్యంత ప్రభావమైన స్థానం బ్రహ్మస్థానానికి ఉంటుంది. ఏ స్థలంలో అయినా మధ్యలో ఉండే స్థానాన్ని బ్రహ్మ స్థానమని అంటారు. అందువల్లే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఇల్లు స్థలానికి మధ్యలో వచ్చేలా కడితే ఆ ఇల్లు అత్యంత శక్తిమంతమై, ఇంటిలోని వారికి మంచి అదృష్టాన్ని, అధికారాన్ని, ఆనందాన్ని చేకూరుస్తుంది. అందువల్ల ఇంటిని బ్రహ్మస్థానంలో ఉండేలా నిర్మించుకుంటే చక్కని ఫలితాలను పొందవచ్చు.
ఇంట్లో పిశాచ స్థానం
ప్రతి స్థలానికి పిశాచ స్థానమని ఒకటి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఈ పిశాచ స్థానంలో ఇల్లు రాకుండా తప్పనిసరిగా ఖాళీ స్థలం వదులుకోవాలి.
తూర్పు పడమరలో పిశాచ స్థానం ఎంత వదలాలి?
తూర్పులో ఉన్న ఖాళీ స్థలంలో ప్రతి 10 అడుగులకు ఒక అడుగు చొప్పున పిశాచ స్థానం కింద విడిచి పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే పడమరలో తూర్పున ఎంత స్థలం విడిచి పెడితే అందులో 1/9 వ వంతు విడిచి పెట్టాలి.
ఉత్తర దక్షిణాల్లో పిశాచ స్థానం ఎంత వదలాలి?
ఉత్తరంలో ప్రతి పది అడుగులకు ఒక అడుగు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఖాళీ స్థలం వదలాలి. దక్షిణ దిక్కున ఉత్తరం దిక్కున వదిలిన స్థలంలో 1/9 వ వంతు విడిచి పెట్టాలి. అలాగే మన స్థలానికి దక్షిణ దిక్కులో ఖాళీ స్థలం ఉన్నట్లైతే దక్షిణ నైరుతిలో తప్పనిసరిగా ఉపగృహం నిర్మించుకోవాలి. ఈ విధంగా ఇల్లు నిర్మించుకున్నట్లైతే ఇంట్లో ఉండేవారికి సకల శుభాలు సర్వ శ్రేయస్సు కలుగుతాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాస్తు ప్రకారం రోజూ ఈ పనులు చేస్తే - ఇంట్లో సుఖసంతోషాలు 10 రెట్లు పెరగడం పక్కా!
నిర్మాణం మధ్యలో ఉన్న ఇంటిని కొనొచ్చా? - వాస్తు ఏం చెబుతోందో తెలుసా?