Ujjain Mangalnath Mandir Pooja : విభిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. సకల దేవీ దేవతలకు, నవగ్రహాలకు భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. నవగ్రహాల్లోనూ ఒక్కో గ్రహానికి ఒక్కో ఆలయం కూడా ఉంది. అందులో ముఖ్యంగా ఎరుపు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో మందిరాలు ఉన్నప్పటికీ, ఉజ్జయినిలోని ఆలయం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది.
అంగారకుని మాతృమూర్తి ఉజ్జయిని?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజధాని ఉజ్జయినిలో వెలసిన అంగారక ఆలయాన్ని మంగళనాథ్ మందిరమని అంటారు. మత్స్య పురాణం, స్కంద పురాణం ప్రకారం అంగారకుడు ఉజ్జయినీలోనే జన్మించాడని, అందుకే ఈ నగరాన్ని అంగారకుని మాతృమూర్తి అని కూడా అంటారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఆలయానికి సరిగ్గా పై భాగంలో ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ చరిత్ర
స్కంద పురాణం ప్రకారం పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తన రక్తం నుంచి వందలాది రాక్షసులు పుడతారని ఈ రాక్షసునికి పరమ శివుని ద్వారా పొందిన వరం ఉండేది. వరగర్వంతో అందరినీ బాధిస్తున్న అంధకాసురుని సంహరించడానికి పరమశివుడు తానే స్వయంగా అంధకాసురుడితో యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శివుడు చెమట ధారలుగా ప్రవహించింది. ఈ చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. భీకర యుద్ధం తర్వాత ఎట్టకేలకు శివుడు అసురుడిని సంహరించగా, శివుని చెమట ద్వారా వచ్చిన వేడినించి ఉద్భవించిన అంగారకుడు రాక్షసుడి రక్తపు చుక్కల నుంచి తిరిగి రాక్షసులు పుట్టకుండా ఆ చుక్కలను తానే స్వీకరిస్తాడు. అందుకే అంగారక గ్రహం అరుణ వర్ణంలో అంటే ఎరుపు రంగులో ఉంటుందని అంటారు. అంగారక గ్రహాన్ని అరుణ గ్రహం అని కూడా అంటారు.
శివుని రూపంలో పూజలందుకునే అంగారకుడు
అంగారకుడు శివుని చెమట నుంచి ఉద్భవించినందున శివ కుమారుడని, పరమ శివుని చెమట భూమిపై పడటం వలన వచ్చిన వేడి నుంచి ఉద్భవించినందున పృథ్వి కుమారుడు అంటే కుజుడని అంటారు. అందుకే ఉజ్జయిని మంగళనాథ్ ఆలయంలో అంగారకుడిని శివుడి రూపంలో పూజిస్తారు. ఈ దేవాలయంలో అంగారకుడిని ఆరాధించడం వల్ల జాతకంలో కుజ దోషాలుంటే పోతాయని భక్తుల విశ్వాసం.
మంగళనాథ్ ఆలయంలో విశేష పూజలు
మంగళనాథ్ ఆలయంలో అంగారక చతుర్థి రోజు విశేషమైన పూజలు జరుగుతాయి. విశేషించి కుజ దోషాలు పోవడానికి ఈ రోజు ప్రత్యేక యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. జాతకంలో కుజ దోషం కారణంగా ఇబ్బందులు పడుతున్నవారు అంగారక శాంతి కోసం దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తారు.
మత్స్య పురాణం, స్కంద పురాణం ప్రకారం అంగారకుడు ఉజ్జయినిలో జన్మించాడు కాబట్టి ఈ ఆలయం దైవిక లక్షణాలు కలిగి ఉందని తెలుస్తోంది. అందుకే ఈ ఆలయ దర్శనం వలన కుజ దోషాల నుంచి సత్వర విముక్తి కలుగుతుందని శాస్త్ర వచనం. మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకుందాం. తరిద్దాం. ఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఉజ్జయిని మహంకాళికి బోనాల శోభ- ఆలయ కథేంటో తెలుసా? రంగం అంటే ఏంటి? - Ujjain Mahankali Bonalu
గురువారమే వాసుదేవ ద్వాదశి- ఈ వ్రతం చేస్తే అంతా శుభమే! - vasudeva dwadashi 2024