TTD Started Accepting VIP Break Darshan Letters : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నా.. స్వామి వారిని దర్శించుకునే సమయం తగ్గనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టీటీడీ కోరింది. అయితే, ఈ నిర్ణయానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. దీంతో సోమవారం (20వ తేదీ) నుంచి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ.300 ఎస్‌ఈడీ టికెట్లు జారీ చేస్తున్నారు. అలాగే ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలను జారీ చేస్తున్నారు. ఈ సిఫార్సు లేఖలతో స్వామి వారి దర్శనానికి తక్కువ సమయం పట్టనుంది.
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?
మే 22న శ్రీ నృసింహ జయంతి : ఇకపోతే.. మే 22వ తేదీన తిరుమలలో శ్రీ నృసింహ జయంతి జరగనుంది. శ్రీవారి ఆలయంలో ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. ఈ వేడుకలలో శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుమలలోని వసంత మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున ఉన్న మండపంలో పడమర దిశలో శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. శాస్త్ర ప్రకారం శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని రూపొందించారు. స్వామివారు ఇక్కడ యోగముద్రలో కనిపిస్తారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు : మే 21, 22వ తేదీలలో తిరుపతి, తరిగొండలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితి సదస్సు నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు భక్తి సంగీతం వంటి వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.
వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్లలేకపోతున్నారా? - హైదరాబాద్ ఆలయంలో 400 ఏళ్లుగా ఉత్తర ద్వార దర్శనం!