Subramanya Swamy Temple Tamilnadu : సుబ్రహ్మణ్యుని షణ్ముఖ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న తిరుచెందూర్ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ఖ్యాతికెక్కింది. కుమార స్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాధలు, మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి. సుబ్రహ్మణేశ్వర స్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే తిరుచెందూర్ మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. ఈ ఆలయ చారిత్రక నేపధ్యం, కుమార స్వామి మహిమలు, ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులను అబ్బురపరుస్తాయి.
ఆలయ స్థల పురాణం
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం ముల్లోకాలను ఇబ్బందులకు గురి చేసే తారకాసురుడు, సూర పద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెదుకుతుంటాడు. వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోని విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెబుతారు. కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత సూర పద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు.
దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును రెండు ముక్కలు చేసి ఆ రాక్షసున్ని సంహరిస్తాడు. చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మర్రిచెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని, కోడిని సుబ్రహ్మణేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు. అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లు చెబుతారు.
మహిమాన్వితమైన విగ్రహం
తిరుచెందూర్‌లో సుబ్రహ్మణ్యుని విగ్రహం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఓ కథ ప్రచారంలో ఉంది.
ఆలయాన్ని ఆక్రమించిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ
1646 - 1648 మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు. స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రోజు రోజుకూ పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకు వెళ్లిపోయారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గంలో వెళ్తున్న సమయంలో పెద్ద తుపాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది.
సముద్రం పాలైన మురుగన్ విగ్రహం
తుపానుకు కారణం మురుగన్ విగ్రహమే అని తలచి డచ్ వారు భయంతో విగ్రహాన్ని సముద్రంలోకి విసిరేస్తారు.
మలయప్పన్ పిళ్లైకి కుమారస్వామి స్వప్న సాక్షాత్కారం
కొద్ది రోజుల తరువాత వాడ మలయప్పన్ పిళ్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెదకమని అదృశ్యమవుతాడు. అలాగే సముద్రంలో వెదకగా విగ్రహం బయటపడుతుంది. దీంతో దానిని మరలా ఆలయంలో ప్రతిష్ట చేశారు. ఈ ఉదంతమంతా ఆలయంలో పెయింటింగ్ రూపంలో కనిపిస్తుంది.
9 అంతస్తుల రాజ గోపురం
సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ట చేసిన తరువాత తిరువాయిదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించాడట. తనకు 9 అంతస్తుల రాజ గోపురం నిర్మించాలని చెప్పాడట.
బంగారు నాణేలుగా మారిన విభూతి
పేదవాడైన దేశికామూర్తి ఆలయం నిర్మాణం కోసం పని చేసే కూలీలకు ధనం ఇవ్వలేక బదులుగా స్వామి విభూదిని పంచేవాడు. వారు కొద్ది దూరం వెళ్లే సరికి ఆ విభూది బంగారు నాణేలుగా మారేది. ఇది తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెబుతారు.
విభూతి మహత్యం
అప్పటి నుంచి స్వామి విభూదిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. దీనిని నుదుట ధరించడం, ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని నమ్ముతారు. అంతేకాదు గతంలో స్వామి విగ్రహం నుంచి విభూతిని తీసి ప్రసాదంగా ఇచ్చేవారంట! కాలక్రమేణా స్వామి విభూతి తీసే ప్రాంతంలో విగ్రహం అరిగిపోవడం వలన తరవాతి కాలంలో ఇవ్వడం ఆపేశారు. ఇప్పటికి పూజారులను అడిగితే స్వామి విగ్రహం తొడ వెనుక అరిగిపోయి ఉండడాన్ని అద్దంలో చూపిస్తారు.
సుందర స్వరూపం
తిరుచెందూర్లోని సుబ్రహ్మణేశ్వరుడి తేజో రూపం భక్తులను ఆకట్టుకుంటుంది. బాలుడి రూపంలో ధాన్య ముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాల సుబ్రహ్మణ్యస్వామిగా పూజలు అందుకుంటున్నాడు.
భుజంగ స్తోత్రం పుట్టింది ఇక్కడే
ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసం తిరుచెందూర్ వెళ్లారు. ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకు ధ్యానంలో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రాన్ని ధ్యానంలోనే ఆశువుగా చెప్పారు.
భుజంగ స్తోత్ర మహత్యం
సాధారణంగా మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి. అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి. దీనికి కారణం మనం తప్పు చేయకపోవచ్చు కానీ, ఎక్కడో వంశంలో ఏదో తప్పు జరిగి ఉంటుంది. దాని ఫలితాన్ని అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానం కలుగక పోవడం, కుష్టు రోగం మొదలైనవి. అటువంటి దోషాలను పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగం ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం అయిన భుజంగ స్తోత్రం నిత్యం పఠిస్తే నాగ దోషం, కాల సర్ప దోషం వంటి భయంకరమైన దోషాలు తొలగిపోతాయి.
ఉత్సవాలు - వేడుకలు
తిరుచెందూర్‌లో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా ఆరు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో రెండు రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో వెలసిన శివాలయం, వల్లీ, దేవసేన ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
ఎలా చేరుకోవాలి
తమిళనాడులోని తూత్తుక్కుడి నుంచి 40 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మధురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోడానికి నిరంతరం రైలు, బస్సు రవాణా సౌకర్యం కలదు.
ఇది మరువద్దు
తిరుచెందూర్‌లో స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి.
సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా తిరుచెందూర్ ఆలయ దర్శనం పుణ్యప్రదం. అంతేకాదు ఈ రోజు ఈ ఆలయం గురించిన కథలు చదివినా విన్నా కూడా తిరుచెందూర్‌లో స్వామి దర్శించిన పుణ్యం కలుగుతుందని శాస్త్రవచనం.
ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.