Padmavathi Brahmotsavam 2024 Panchami Theertham : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం ఘనంగా జరగనుంది. ఈ చక్రస్నాన ఉత్సవాన్ని పంచమి తీర్థం అని కూడా అంటారు. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణం తో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా పంచమి తీర్థం విశిష్టత తెలుసుకుందాం.
పంచమి తీర్థం విశిష్టత
పవిత్ర వేద మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాద్యాల నడుమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం అత్యంత కీలకమైన ఉత్సవం చక్రస్నానం జరుగుతుంది.
పంచమి తీర్థం అని ఎందుకు అంటారు?
వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని వేంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం శ్రీ పద్మావతీ అమ్మవారు కార్తిక మాసంలో శుక్లపక్షం, పంచమి తిథి, శుక్రవారం నాడు జన్మించారని తెలుస్తోంది. అందుకే బ్రహ్మోత్సవాల ముగింపు రోజు జరిగే చక్రస్నానం పంచమి రోజునే జరగడం ఆనవాయితీ. పద్మ సరోవరం నుంచి ఉద్భవించిన అమ్మవారికి జరిపించే చక్రస్నానం జరిగే తీర్థం కాబట్టి ఈ పవిత్ర ఘట్టానికి పంచమి తీర్థం అని పేరు వచ్చింది. ఈ చక్ర స్నానానికి అవబృద స్నానమని కూడా పేరుంది.
అవబృద స్నానం అంటే
అవబృద స్నానం అంటే ఏదైనా యజ్ఞం పరిసమాప్తి అయినప్పుడు యజ్ఞ మంత్రాలతో పునీతమైన కలశాలలోని పవిత్ర జలాలతో చేయించే మంగళ స్నానం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవల పేరిట ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు తొమ్మిదో రోజు ఉదయం పవిత్ర పుష్కరిణిలో జరిపించే సుదర్శన చక్రస్నానంతో పరిసమాప్తి అవుతుంది. బ్రహ్మోత్సవాలనే పవిత్ర యజ్ఞానికి ముగింపు పలికే ఈ చక్రస్నానం కూడా అవబృద స్నానం వంటిదని శాస్త్ర వచనం.
చక్రస్నానం ఇలా!
కార్తిక బ్రహ్మోత్సవాలలో చివరిరోజు పద్మసరోవరంలో వైభవంగా చక్రస్నానం జరుగుతుంది. అంతకుముందు పంచమి తీర్థ మండపంలో అర్చకులు అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేష అభిషేకాలు జరుగుతాయి.
స్నపన తిరుమంజనం
స్నపన తిరుమంజనంలో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యంజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహిస్తారు. అర్ఘ్య పాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధం తో స్నపనం జరుగుతుంది. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా జరిగే స్నపన తిరుమంజనం కళ్లారా చూసిన వారికి అనంత పుణ్యం.
అశేష జనవాహిని మధ్య శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కి పద్మసరోవరంలో ఆగమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ధ్వజావరోహణం
చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం కార్యక్రమం జరుగుతుంది. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాప విముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. ఆ పద్మావతి దేవి అనుగ్రహంతో అప మృత్యు నాశనం, రాజ్యపదవుల వంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు.
కార్తిక బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని దర్శించడం పూర్వజన్మ సుకృతం ఐశ్వర్యకారకం.
శ్రీ పద్మావతి దేవి కరుణాకటాక్షాలు భక్తులందరిపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ,
ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.