Tips For Goddess Lakshmi Blessings : ధనమూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ధనం లేకపోతే ఏ పనులు కావు. మరి ధనం రావాలంటే కష్టించి పని చేయాలి. ఎంత కష్టపడినా కొంత సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కూడా ఉండాలి కదా! ఆ సిరి మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే 11 ముఖ్య సూత్రాలు పాటించాలి అంటుంది శాస్త్రం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. ఈ ఒక్కటి పాటిస్తే వ్యాపారాలు కుబేరులు కావడం ఖాయం!!
వ్యాపారులు తమ వ్యాపారం ప్రారంభించే ముందు శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపించుకుంటే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడూ ధనానికి లోటుండదు.
2. ఈ పూజతో లక్ష్మీ కటాక్షం
పూజామందిరంలో ఒక శుభదినం రోజు కానీ, పౌర్ణమితో కూడిన శుక్రవారం రోజు కానీ 108 రూపాయి నాణేలతో లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామ స్తోత్రం చేసి, ఆ రోజు సాయంత్రం పూజ చేసిన నాణేలను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి డబ్బులు పెట్టే బీరువాలో ఆ మూటను ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
3. పుట్టింటి నుంచి ఇవి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు వెన్నంటి ఉంటాయి
మహిళలు తమ పుట్టింటి నుంచి రెండు వెండి దీపారాధన కుందులు తెచ్చుకొని వాటితో ప్రతినిత్యం పూజామందిరంలో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం.
4. మహిళలు ఇవి ధరిస్తే ఇంట్లో ధనప్రవాహం
మహిళలు లక్ష్మీదేవి రూపు లాకెట్‌తో ఉన్న దండను మెడలో ధరించడం కానీ, లక్ష్మీదేవి రూపు ఉన్న ఉంగరాన్ని కుడిచేతి ఉంగరం వేలుకి కానీ ధరిస్తే ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు.
5. ఇష్టకామ్యార్థ సిద్ధి కోసం ఇలా చేయాలి!!
శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రోజుకు 12 సార్లు చొప్పున 36 రోజుల పాటు పారాయణ చేసి ప్రతిరోజూ అమ్మవారికి పరమాన్నం నివేదిస్తే మన మనసులో ఉన్న అన్ని కోరికలు తప్పకుండా తీరుతాయి.
6 . అమావాస్య శుక్రవారం లక్ష్మీ పూజకు శ్రేష్టం
లక్ష్మీదేవికి అమావాస్య అంటే ప్రీతి. అందుకే ఒక అమావాస్యతో కూడిన శుక్రవారం నుంచి మొదలుపెట్టి మొత్తం 20 శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ చేస్తే ఎంతటి వారైనా కుబేరులు కావడం ఖాయం.
7. సర్వతోముఖాభివృద్ధికి ముఖ్య సూత్రం
వివిధ రంగాల్లో పనిచేసే వారు రుణాల నుంచి బయటపడి అభివృద్ధి చెందాలంటే బంగారు, వెండి లేదా ఇత్తడి తో చేసిన లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ఉంచి ప్రతినిత్యం పూజించాలి. ఈ ప్రతిమ చిన్నదిగానే ఉండాలి.
8. ఇలా చేస్తే ఎంత మొండి బాకీలైన వసూలవుతాయి
మనకు రావలసిన బాకీలు ఎంతకూ వసూలు కాకుండా ఉంటే 9 రోజుల పాటు రోజుకు 12 సార్లు చొప్పున శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇలా చేస్తే మీకు డబ్బు అప్పు ఉన్నవారు మీ బాకీని పువ్వుల్లో పెట్టి తిరిగి ఇచ్చేస్తారు.
9. ఇలాచేస్తే ఇంట్లో కనకవర్షమే!
ధన సంపాదన బాగా పెరగాలంటే 40 రోజులపాటు రోజుకు 3 సార్లు చొప్పున కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేస్తే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని శాస్త్ర వచనం.
10. ఇంటి ఆరు బయట ఇలా చేస్తే రుణ విమోచనం, లక్ష్మీకటాక్షం
మీ ఇంటి వెలుపల ఆరు బయట చీమలకు ఆహారంగా పంచదార చల్లితే మీ రుణాలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
11. బిల్వార్చనతో స్థిరమైన సంపాదన
జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరమైన సంపాదన కావాలంటే లక్ష్మీదేవిని మారేడు దళాలతో అర్చిస్తే జీవితంలో సంపాదనలో స్థిరత్వం వస్తుంది. ఈ 11 సూత్రాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుదాం.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.