Sri Padmavati Parinayotsavam Latest News : ప్రపంచ నలుమూలల నుంచీ ఎంతో మంది భక్తులు తిరుమలలో కొలువైన కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. వేసవి కాలంలోనైతే భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందులో మీరు కూడా ఉండబోతున్నట్టయితే.. మీకు ఒక ముఖ్య గమనిక. తిరుమలలో మే 17వ తేదీ నుంచి మే 19 తేదీ వరకు 'శ్రీపద్మావతి పరిణయోత్సవాలు' జరగనున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూడు రోజుల పాటు కొన్ని సేవలను రద్దు చేసింది. మరి.. ఏ సేవలు రద్దయ్యాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు :
మే 17 నుంచి మే 19వ తేదీ వరకు తిరుమలలో శ్రీపద్మావతి పరిణయోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో వైభవంగా జరుపుతారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో మొదటి రోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. అలాగే ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. తర్వాత ఎంతో వైభవంగా కల్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మూడు రోజులు (మే 17-19) వరకు "ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార" సేవలను రద్దు చేసింది.
శ్రీపద్మావతి పరిణయోత్సవాల విశిష్టత :
హిందూ పురాణాల ప్రకారం.. దాదాపు 5 వేల ఏళ్ల క్రితం సాక్షాత్తూ వైకుంఠం నుంచి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారట. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె శ్రీ పద్మావతి అమ్మవారిని వేంకటేశ్వరస్వామికి ఇచ్చి వివాహం జరిపించారని పండితులు చెబుతున్నారు. వైశాఖశుద్ధ దశమి శుక్రవారం రోజున శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు.. నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
ఆ రోజు నుంచి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా.. ఏటా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు.. తర్వాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజులపాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1992 సంవత్సరం నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు జరుగుతున్నాయి. ఆ కాలం నాటి నారాయణవనానికి ప్రతీకగా ఇప్పుడు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయ వేడుకలు నిర్వహించడం విశేషమని పండితులు చెబుతున్నారు.
వెంకన్నకు తలనీలాలు ఇస్తే గండాలు పోతాయా? అసలు ఎందుకు ఇస్తారో తెలుసా? - why we offer hair in tirupati