Sravana Somavaram Pooja In Telugu : శివ మహా పురాణం, లింగ పురాణం ప్రకారం శ్రావణ సోమవారాలు శివుని ఆరాధనకు విశిష్టమైనవి. జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన ప్రకారం శ్రావణ సోమవారం రోజు శివుడి ఆరాధనలో వాడే ద్రవ్యాలకు కూడా విశిష్టమైన ప్రాశస్త్యం ఉంది. శ్రావణ సోమవారాల్లో శివుడి పూజకు, అభిషేకానికి వాడే ద్రవ్యాలలో ఒక్కో దానికి ఒక్కో విశిష్టమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి వాటితో శివుడికి పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం.
- శ్రావణ మాసంలో ప్రతి సోమవారం గంగాజలంతో శివుడి అభిషేకిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక బాధలు దూరమవుతాయి.
- శ్రావణ సోమవారం శివపార్వతులకు కుంకుమపువ్వు కలిపిన పచ్చి పాలను నివేదిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది.
- శ్రావణ సోమవారం రోజు నల్ల నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు, మానసిక బాధలు శాశ్వతంగా దూరమవుతాయి.
- వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న దంపతులు శ్రావణ సోమవారం రోజు పంచామృతాలతో శివ పార్వతులకు అభిషేకం చేస్తే అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. వైవాహిక బంధం దృఢపడుతుంది.
- శ్రావణ సోమవారం రోజు శివలింగానికి తేనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే వివాహం ఆలస్యం అయ్యే వారికి శ్రీఘ్రంగా వివాహం జరుగుతుంది.
- వ్యాపారంలో కష్టనష్టాలతో బాధ పడేవారు, ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునే వారు శ్రావణ సోమవారం రోజు చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అన్ని సమస్యల నుంచి బయట పడతారు.
- ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు శ్రావణ సోమవారం రోజు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే కోర్టు సమస్యల నుంచి గట్టెక్కుతారు.
శివపూజకు ఇదే ముఖ్యం
జ్యోతిష్య శాస్త్ర పండితులు మానవ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకు పరిష్కారంగా శ్రావణ సోమవారం శివయ్యను ఎలా ఆరాధించాలో సూచించారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన' అని చెప్పినట్లుగా మానవులు కర్మను మాత్రమే ఆచరించాలి. ఫలితాన్ని భగవంతునికి విడిచిపెట్టాలి. శివపూజకు చిత్తశుద్ధి ముఖ్యం. "చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!" అని వేమన కవి చెప్పారు. భగవంతుని మీద చెరగని భక్తి విశ్వాసాలతో మనం చేసే పూజలు చిత్తశుద్ధితో చేస్తే కొండంత కష్టం కూడా దూదిపింజలా తేలిపోతుంది. ఇది పురాణాలలో చెప్పిన సత్యం. శ్రావణ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు చెరగని భక్తి విశ్వాసాలతో శివయ్యను ఆరాదిద్దాం. అనంత కోటి శుభ ఫలితాలను పొందుదాం. ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
కాశీలోని యమాదిత్యుడి ఆలయాన్ని విజిట్ చేశారా? దాని ప్రత్యేకత తెలుసా? - Kashi Yama Aditya Temple
ఆరోగ్య ఐశ్వర్యాలనిచ్చే 'భాను' సప్తమి పూజ- ఎలా చేయాలో తెలుసా? - Bhanu Saptami 2024