Vinayaka Idol Immersion 2024 : వర్షఋతువులో వచ్చే భాద్రపదమాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఇదే మాసంలో విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము. అదే వినాయక చవితి!
వినాయక చవితి సంప్రదాయం యావత్తూ, ప్రకృతికి అనుగుణంగా సాగుతుంది. నదులలో, వాగులలో దొరికే ఒండ్రుమట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము. ఏకవింశతి పత్రి పూజ పేరుతో 21 రకాల ఆకులతో గణనాధుని పూజిస్తాం. ఇలా కొలుచుకున్న స్వామిని, ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము. సృష్టి, స్థితి, లయ అనే మూడు దశలు వినాయక చవితి పూజలో కనిపిస్తాయి.
నిమజ్జనంలో ఔషధీ తత్వం
వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ, పత్రాలలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికీ ఈ విగ్రహాన్నీ, పత్రాలనూ తాకడం వల్ల వాటిలోని ఔషధి తత్వం మనకి చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్నీ, పత్రాలనూ ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరతాయి.
ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్నీ, పత్రాలనీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము. ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు. అంతేకాదు! వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి. వాగులూ, నదులూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి.
అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట. అందుకేనేమో! నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్ష రుతువులోనే వస్తాయి.
సామాజిక అంశాలు
ఇదండీ నిమజ్జనం వెనుక ఉన్న విశేషం. అంతే కాదు ప్రకృతి పరమైన అంశాలతో బాటు ఇందులో సామాజికాంశాలూ కూడా ఉన్నాయి. ఎవరికివారే యమునాతీరే అన్న రీతిగా మారిన ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలసిన తర్వాత, ఇరుగూపొరుగూ కలిసి కోలాహలంగా ఈ వేడుకని జరుపుకోవడం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో పిల్లలు, పెద్దలు కలిసి ఆనందంగా గడపడం మనం చూస్తున్నాం. ఇందువలన ఇరుగుపొరుగు వారి మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా విశేషాలు కూడా వెలికి వస్తాయి.
ప్రకృతే దైవం
వినాయక చవితి పండుగ సహజంగా ప్రకృతిని పరిరక్షించే పండుగ. ఇలాంటి గొప్ప పండుగను మనం ప్రాచీన కాలం నుండి వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి మట్టి విగ్రహాలనే పూజించాలి. ఇలాంటి మట్టి విగ్రహాలను పూజించి వాటిని నిమజ్జనం చేయడం వలన చెరువుల, నదులు నీరు కలుషితం కాదు. కృత్రిమ రసాయనాలు, హానికారక పదార్ధాలతో చేసిన గణపతి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడమా వలన ప్రకృతికి హాని చేసిన వారమవుతాం. అందుకే మట్టి విగ్రహాలను పూజించి నిమజ్జనం చేద్దాం. ప్రకృతిని రక్షించుకుందాం.
నిమజ్జనం ఇలా కూడా చేయవచ్చు
హైదరాబాద్, ముంబై వంటి పెద్ద పెద్ద నగరాలలో గణేష్ నిమజ్జనం అత్యంత కోలాహలంగా జరుగుతుంది. పూజ చేసిన ప్రతి ఒక్కరూ ఒకే ప్రాంతంలో నిమజ్జనం చేయాలంటే కష్టసాధ్యం. అందుకే ప్రభుత్వం ఎవరికి అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఉన్న చెరువులలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తారు.
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఇలాంటి సమయంలో ఇంట్లో పెట్టుకునే చిన్న చిన్న విగ్రహాలను కూడా జలాశయాల వద్దకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. ఎలాగంటే ఇంట్లో ఒక టబ్ లోకాని బకెట్ లో కానీ నీళ్లు పోసి అందులో విగ్రహాన్ని ఉంచి విగ్రహం కరిగే వరకు అలాగే ఉంచేయాలి. విగ్రహం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆ నీటిని మొక్కల్లో పోసి అడుగున మిగిలిపోయిన మట్టిని కూడా మొక్కల్లో వేసుకోవచ్చు. ఇలా చేస్తే మన వినాయకుడు మన ఇంట్లోనే ఉన్న అనుభూతి కలుగుతుంది కదా! అదే సమయంలో నిమజ్జనం రద్దీని కూడా తగ్గించినట్లు అవుతుంది. మీరేమంటారు? ఈసారి నిమజ్జనం ఇలా చేసి చూద్దాం. పర్యావరణాన్ని రక్షిద్దాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
రూ.2.3 కోట్లతో గణేశ్ మండపం అలంకరణ - ఎక్కడో తెలుసా? - ganesh celebrations in ap