Significance Of Nanjundeshwara Temple Karnataka : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజుండేశ్వర క్షేత్రం కర్ణాటకలోని మైసూరుకు దగ్గరలో ఉన్న నంజున్గఢ్ జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని శ్రీకంఠీశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠిచినట్లుగా ఆలయ శిలాఫలకాలు మీది శాసనాల ద్వారా తెలుస్తోంది.
నంజుండేశ్వరడు అంటే?
కన్నడ భాషలో నంజ అంటే విషం, నంజుంద అంటే విషాన్ని స్వీకరించిన వాడు అనే అర్థం వస్తుంది. క్షీర సాగర మధనంలో వెలువడిన కాలకూట విషాన్ని స్వీకరించి, ఆ విషాన్ని తన కంఠంలోనే నిలుపుకొని శివుడు గరళకంఠుడయ్యాడు. ఆ నీలకంఠ శివుడే ఇక్కడ నంజుండేశ్వరుడిగా పూజలందుకున్నాడని విశ్వాసం.
దీర్ఘకాలిక వ్యాధులు నయం
నంజుండేశ్వరడుని దర్శిస్తే దీర్ఘకాలిక వ్యాధులే కాదు మొండి రోగాలు కూడా నయమవుతాయని విశ్వాసం. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కపిల నదిలో స్నానం చేసి వచ్చి నంజున్ దేశ్వరునికి 'ఉరుల్' అనే సేవ చేసుకుంటే ఎలాంటి వ్యాధి అయినా క్రమంగా తగ్గుముఖం పడుతుందని భక్తుల విశ్వాసం.
నంజుండేశ్వరుని మహిమలు
పూర్వం కర్ణాటకను పాలించిన టిప్పుసుల్తాన్ ఏనుగుకు కళ్ల సంబందిత వ్యాధి వచ్చి ఎంతకీ తగ్గకపోతే, నంజుండేశ్వరుడికి పూజలు చేయిస్తే ఏనుగుకు వ్యాధి వెంటనే తగ్గిందట. అందుకు కృతజ్ఞతగా టిప్పు సుల్తాన్ వారికి పచ్చల పతకం, పచ్చల కిరీటం చేయించాడట.
పరశురామ క్షేత్రం
నంజుండేశ్వరుడి ఆలయానికి సమీపంలో పరశురామ క్షేత్రం ఉంది. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరస్సు ఖండించిన తర్వాత ఆ మానసిక వ్యాధితో ఆసేతు హిమాచలం పర్యటించినా దొరకని మనశ్శాంతి ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే పొందాడట! అందుకే ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
ప్రథమ దర్శనం ఇక్కడే!
నంజుండేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఈ పరశురామ క్షేత్రాన్ని దర్శించుకోవాలంట! లేకుంటే దర్శన ఫలం దక్కదని అంటారు.
ఉత్సవాలు - వేడుకలుఠ
నంజుండేశ్వరుడి ఆలయంలో ఏడాదికి రెండు సార్లు ఘనంగా రథోత్సవం జరుగుతుంది. మొదటిది దొడ్డ రథోత్సవం రెండవది చిక్క రథోత్సవం. అయిదు రథాలతో జరిగే ఈ రథోత్సవం చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. మూడు రోజుల పాటు జరిగే రథోత్సవంలో 5 రథాలలో శివుని, పార్వతి దేవిని, గణపతిని, కుమారస్వామిని, చండికేశ్వరుని తిరువీధులలో ఊరేగిస్తారు. అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవంలో భక్తులు ఓం నమః శివాయ అంటూ రథాలను లాగి తమ భక్తిని చాటుకుంటారు. దీర్ఘకాలిక రోగాలను నయం చేసుకొని మనశ్శాంతిని పొందడానికి ఆ శివయ్యను దర్శించుకుందాం. ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.