Shravana Shanivara Shani Puja In Telugu : శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రంతో కూడి ఉంటుంది. అందుకే ఈ మాసం శ్రీమన్నారాయణుని ఆరాధనకు కూడా శ్రేష్టమైనది. వ్యాసభగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం ఈ మాసంలో ప్రత్యేకించి శనివారాలలో చేసి కొన్ని పరిహారాలు శని బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని శాస్త్రవచనం.
శ్రావణ శనివారం పరిహారాలు ఎవరు చేయాలి?
జాతకరీత్యా ఏలినాటి శని, అర్ధాష్టమ శని దశలు జరుగుతున్న వారు, అలాగే జాతకం ప్రకారం శని మహర్దశ నడుస్తున్నవారు, ఇంకా శని అధిపతి అయిన మకర, కుంభ రాశుల వారు ఈ పరిహారాలు చేయడం వలన జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి.
- శ్రావణ శనివారం రోజు గోమాతను పసుపు కుంకుమలతో పూజించి, గ్రాసం తినిపించడం వల్ల చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది.
- అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అంటారు. శ్రావణ శనివారం రోజు పేదలకు అన్నదానం చేయడం వలన దారిద్య్ర బాధలు తొలగిపోతాయి.
- శ్రావణ శనివారం రోజు వస్త్రదానం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి.
- శ్రావణ శనివారం రోజు నవగ్రహాలున్న ఆలయంలో పూజారికి నవధాన్యాలు దానం చేయడం వల్ల అన్ని గ్రహాల అనుకూలతతో వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది.
- శ్రావణ శనివారం రోజు పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి.
- శ్రావణ శనివారం రోజు రావి చెట్టు మొదట్లో మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.
- శ్రావణ శనివారం రోజు ఉపవాసం ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇంట్లో పిండి దీపారాధన చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది.
- శ్రావణ శనివారం రోజు ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి దానం చేస్తే అపమృత్యు దోషాలు, అకాలమృత్యు భయాలు తొలగిపోయి దీర్ఘాయుష్షు కలుగుతుంది.
- శ్రావణ శనివారం రోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
- శ్రావణ శనివారం రోజు హనుమంతుని ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే రుణ బాధలు, శత్రు భయాలు తొలగిపోతాయి.
ఈ తప్పులు చేయకండి
శ్రావణ శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు, ఇనుము, నల్లని వస్తువులు, నూనె లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకోకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి పొరపాట్లు చేయడం వలన అనేక కష్టనష్టాలకు గురి కావాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం శనివారాలలో ఈ పరిహారాలు పాటిద్దాం. సుఖశాంతులను పొందుదాం. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.