Shirdi Sai Baba Udi Miracles : షిర్డీ సాయినాథుని నిత్యం ఎందరో పూజిస్తుంటారు. సాయి దర్శనం ఎన్నో కఠిన సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని సాయి భక్తులు అంటుంటారు. సాయినాథుని అనుగ్రహానికి ప్రతిరూపంగా ఊదీని భావిస్తుంటారు. సర్వరోగ నివారిణిగా భావించి స్వీకరిస్తుంటారు.
ఆపదలను పోగొట్టే ఊదీ
షిర్డీ సాయి సచ్చరిత్రలో వివరించిన ప్రకారం, ఊదీతో రోగ హరణం మాత్రమే కాదు ఆపత్కాలంలో అనేక కష్టాలను కూడా పోగొడుతుందని ప్రస్ఫుటమవుతుంది. శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్రలో ఊదీ మహత్యాన్ని వివరించే భక్తుల స్వీయ అనుభవాలు కథల రూపంలో ఉన్నాయి. అందులో ఒక కథను ఈ రోజు తెలుసుకుందాం.
బాబా భక్తుడు బాలాజీ నేవాస్కరు
షిర్డీ సాయి పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు కల బాలాజీ నేవాస్కరు అనే భక్తుడు తన జీవితాంతం బాబాను తలుచుకుంటూ, కొలుచుకుంటూ, బాబాను సేవిస్తూ గడిపాడు. చివరకు అతడు కన్నుమూశాడు.
ఊహించని ఘటన
బాలాజీ నేవాస్కరు మరణానంతరం అతడి కుటుంబ సభ్యులు అతని సంవత్సరీకాలను శ్రద్ధగా జరుప నిశ్చయించారు. తమకు ఉన్నంతలో వారు అన్నీ సమకూర్చారు. భోజనాల సమయం ఆసన్నమైంది. ఆ దేవుడు తన భక్తులను ఎప్పుడూ పరీక్షించాలని ఎందుకు అనుకుంటాడో కానీ ఆరోజు నేవాస్కరు సంవత్సరీకానికి అనుకున్నదానికంటే ఎక్కువ మంది భోజనానికి వచ్చారు. సిద్ధం చేసిన వంటకాలు చూస్తేనేమో వారిలో మూడో వంతుకి మాత్రమే సరిపోయేట్లు ఉన్నాయి. ఆ పరిస్థితి చూసి బాలాజీ భార్య గాభరా పడిపోయింది.
సర్వ కష్ట హరణం సాయినాథుని ఊదీ ధారణం
అనుకున్నదానికంటే ఎక్కువ మంది రావడం వల్ల బాలాజీ నేవాస్కరు భార్య కంగారు పడినా, అతడి తల్లి మాత్రం భారమంతా సాయినాథుని పైనే వేసింది. నేవాస్కరు భార్య తయారు చేసిన వంటకాలన్నింటి మీద కాస్త సాయినాథుని ఊదీని చల్లి, వాటిని గుడ్డతో మూసివేయమని సలహా ఇచ్చింది. బాబానే ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తారని ఆమెకు అభయమిచ్చింది. మనసులోనే త్రికరణ శుద్ధిగా బాబాకు నమస్కరించి నిశ్చింతగా ఉంది. ఇప్పుడు ఇక ఆ వంటకాలు కేవలం ఆహారపదార్థాలు కాదు బాబా వారి దివ్య ప్రసాదంగా మారిపోయాయి.
సాయినాథుని ఊదీ మహత్యం
ఇంతలో భోజనాలకు అందరూ కూర్చున్నారు. బాలాజీ తల్లి నమ్మకం ప్రకారమే ఆ సాయినాథుని దివ్య అనుగ్రహంతో వండిన పదార్థాలు అందరికీ సరిపోవడమే కాకుండా ఇంకా మిగిలిపోయాయి కూడా! ఆ సాయిబాబా తనను ఆశ్రయించిన వారిని ఎటువంటి కష్టం కలగకుండా ఆదుకుంటాడని అనడానికి ఇంతకూ మించి నిదర్శనం ఇంకేమి కావాలి? బాబా వారి ఊదీ మహత్యాన్ని చాటిచెప్పే భక్తుల స్వీయ అనుభవాలు ఇలాంటివి ఎన్నింటినో మనం సాయి సచ్చరిత్రలో చూడవచ్చు. ఆ సాయినాథుని అనుగ్రహం అందరిపై పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ - శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.