Shani Jayanti Puja Vidhi : హిందూ పురాణాల ప్రకారం, సూర్యుడు, ఛాయ దేవి కుమారుడే శని దేవుడు. నలుపు వర్ణంలో ఉండే శని దేవుని స్థానం ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటుందో వారికి శనీశ్వరుని అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది. శని జయంతి రోజు యథావిథిగా శని దేవుని పూజించిన వారికి శని అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. జాతక ప్రకారం శని బలహీనంగా ఉంటే రాజయినా అష్టకష్టాలు పడాల్సిందే! చివరకు పరమ శివుడంతడి వాడు కూడా శని బాధలను తప్పించుకోలేకపోయాడు. ఇక సామాన్య మానవులెంత!
శని దోషాలను పోగొట్టే శని జయంతి పూజ
అందుకే ఎవరి జీవితంలో అయితే అనుకోని అవాంతరాలు, ఆకస్మిక మార్పులు వస్తాయో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందడానికి శని జయంతి రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించాలి. అంతే కాకుండా గ్రహ సంచారం ప్రకారం జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్లు కూడా శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషాల నుంచి విముక్తి పొంది శని భగవానుని అనుగ్రహంతో సత్ఫలితాలు పొందవచ్చు.
శని జయంతి పూజా విధానం
- శనిజయంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి శుచియై ముందుగా శని భగవానుని తండ్రి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.
- ఈ రోజు పూర్తిగా ఉపవాసం చేస్తానని దేవుని సమక్షంలో సంకల్పించుకోవాలి.
- ఇంట్లో పూజామందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి నమస్కరించుకోవాలి.
- నిత్యపూజాదికాలు ముగించుకొని నవగ్రహాలున్న దేవాలయానికి వెళ్లాలి. అది శివాలయమైతే మరీ మంచిది.
- నవగ్రహాల మంటపం వద్ద శనీశ్వరునికి పూజారి చేత తైలాభిషేకం మంత్రపూర్వకంగా చేయించుకోవాలి.
- శని దేవునికి నల్లని వస్త్రాన్ని సమర్పించాలి. నల్ల నువ్వులతో అష్టోత్తర శతనామ పూజ చేయించుకోవాలి.
- మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
- పూజ పూర్తయ్యాక తమలపాకులో బెల్లం ఉంచి శనిదేవునికి నివేదించాలి.
- అనంతరం నవగ్రహాలకు తొమ్మిది కానీ, పదకొండు కానీ ప్రదక్షిణాలు చేయాలి.
- చివరగా బ్రాహ్మణులకు శక్తి మేరకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకోవాలి.
- శనీశ్వరునికి పూజ పూర్తయ్యాక కాళ్లు కడుక్కొని శివునికి జలాభిషేకం చేసి ఇతర దేవీ దేవతల దర్శనం చేసుకోవాలి.
- ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత సాత్విక ఆహారం తీసుకోవాలి.
శని జయంతి రోజు ఈ దానాలతో దోష పరిహారం
శని జయంతి రోజున పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయాలి. కాకులకు, నల్ల చీమలకు ఆహారం అందించాలి. రోగులకు పండ్లు , పాలు, మందులు వంటివి దానం చేస్తే జీవించి ఉన్నంత వరకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు దరిచేరవని అంటారు. వృద్ధులకు, గురువులకు సేవ చేయడం కూడా ఎంతో మంచిది.
శని జయంతి పూజ చేసేవారు పాటించాల్సిన నియమాలు
శనిదేవుని అనుగ్రహం కోసం పూజ చేసేవారు ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహరం మాత్రమే తీసుకోవాలి. మద్యమాంసాలు ముట్టరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నియమాలు పాటిస్తూ శని జయంతి రోజు పూజలు చేస్తే శని దోషాలు నుంచి విముక్తి కలిగి సకల శుభాలను పొందుతారు.
శని జయంతి రోజు మనం కూడా శనిదేవుని పూజిద్దాం. శనిదేవుని అనుగ్రహంతో సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ శనైశ్చరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఒక్కరిని పూజిస్తే ఐదుగురు దేవుళ్ల అనుగ్రహం పొందినట్లే! ఎలా పూజించాలో తెలుసా? - SPECIAL PUJA BENEFITS