Rudraksha Wearing Benefits: కొన్ని రోజుల క్రితం మనం ఈటీవీ భారత్ ద్వారా పంచముఖి రుద్రాక్ష వరకు గల ఫలితాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన వాటి గురించి తెలుసుకుందాం.
షణ్ముఖి రుద్రాక్ష
సాక్షాత్తు షణ్ముఖుడు శ్రీసుబ్రమణ్య స్వామికి ప్రతిరూపంగా భావించే ఈ షణ్ముఖ రుద్రాక్ష ధారణ వల్ల రక్తపోటు, నరాల సంబంధిత వ్యాధులు నశిస్తాయి. షణ్ముఖ రుద్రాక్ష ధరిస్తే జ్ఞానం, శక్తి, ఆరోగ్యం లభిస్తాయి.
సప్తముఖి రుద్రాక్ష
కామధేనువు స్వరూపంగా భావించే సప్తముఖి రుద్రాక్ష ధారణ వల్ల విశ్వాసం, సంపద, కీర్తి, ఉత్తేజం లభిస్తాయి. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల అకాల మరణం ఉండదని శాస్త్రం చెబుతోంది.
అష్టముఖి రుద్రాక్ష
సాక్షాత్తు శ్రీ వినాయకుని స్వరూపంగా భావించే అష్టముఖి రుద్రాక్ష ధారణ వల్ల సూక్ష్మ బుద్ధి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
నవముఖి రుద్రాక్ష
నవముఖి రుద్రాక్ష కాలభైరవ స్వరూపమని కొందరంటే, మరికొందరు నవగ్రహ స్వరూపమని అంటారు. దుర్గాదేవి ఉపాసకులు ఎక్కువగా ఈ రుద్రాక్షను ధరిస్తారు. ఈ రుద్రాక్ష ధరిస్తే రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లభిస్తాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.
దశముఖి రుద్రాక్ష
శ్రీమన్నారాయణుడి స్వరూపం, దశావతారాలకు ప్రతీక అయిన ఈ రుద్రాక్ష ధరిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం దక్కుతుంది. సమస్త గ్రహ దోషాలను పోగొట్టే ఈ రుద్రాక్ష ధరిస్తే గొంతు సంబంధిత వ్యాధులు పోతాయని పెద్డలు అంటారు.
ఏకాదశముఖి రుద్రాక్ష
శివాత్మక స్వరూపంగా భావించే ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ వల్ల దాంపత్య అనుకూలం, గర్భ సంబంధ దోషాలు తొలగిపోతాయి.
రుద్రాక్షలు ధరించాల్సిన విధివిధానం
రుద్రాక్షలు 108 కానీ, 54 కానీ, 27 కానీ బంగారం లేదా వెండి తీగలో చుట్టించుకుని శాస్త్రోక్తంగా పూజ జరిపించి మెడలో ధరించవచ్చు లేదా జపమాలగా పూజలో వాడుకోవచ్చు.
రుద్రాక్ష వల్ల వైద్య ప్రయోజనాలు
రుద్రాక్షలు ధరించడం వల్ల రక్తపోటు, హృద్రోగ సంబంధ, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని విశ్వాసం.
రుద్రాక్షలు ఎవరు ధరించవచ్చు?
రుద్రాక్షలు స్త్రీ, పురుష తేడా లేకుండా ఎవరైనా ధరించవచ్చు.
ఈ నియమాలు తప్పనిసరి!
రుద్రాక్షలు ధరించిన వారు తప్పనిసరిగా కొన్ని నియమనిబంధనలు పాటించాలి. రుద్రాక్షలు ధరించి మద్యమాంసాలు సేవించకూడదు. తప్పనిసరిగా శుభ్రత పాటించాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. నియమ నిష్ఠలను పాటించాలి. దంపతులు దాంపత్య సమయంలో రుద్రాక్షలు ధరించరాదు. ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మీరు ధరించే రుద్రాక్ష ఏ రకం? - మొత్తం 21 రకాలు - వాటి విశిష్టతలు తెలుసా?