Rameswaram Temple History : ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన 'రామేశ్వరం' తమిళనాడులో ఉంది. హిందూ మహా సముద్రం, బంగాళాఖాతం సంగమస్థానంలో కనిపించే చిన్న ద్వీపం ఇది. ఇక్కడ కొలువైన ఆ పరమ శివుడు రామనాథస్వామిగా భక్తులకు దర్శమిస్తుంటారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. చరిత్రతోపాటు రామేశ్వరం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రామేశ్వరం చరిత్ర :
పురాణాల ప్రకారం.. త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకు చేరుకున్నాడు. తర్వాత రావణుడిని సంహరించిన అనంతరం రాముడు - సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్లేటప్పుడు ఇక్కడ సేదతీరారని పురాణోక్తి.
అప్పుడు.. మహాజ్ఞానీ, శివభక్తుడూ అయిన రావణుడిని సంహరించినందుకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోకుండా ఉండటానికి.. పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారట. అప్పుడు.. కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడట రాముడు.
అయితే.. బయల్దేరి వెళ్లిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గరపడుతున్నా రాలేదట. దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారుచేసిందట. ఆ శివలింగానికే రాముడు పూజలు చేశాడట. ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు.. ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటినీ ప్రతిష్ఠించాడట. అంతేకాదు.. భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్నే దర్శించుకోవాలనే కోరాడట.
మీ ఇష్ట దైవానికి ఈ పూలు సమర్పించొద్దట! - మీకు తెలుసా? - Never Offer These Flowers to Gods
అందుకే.. ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలూ, నైవేద్యాలూ చేసిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారు. ఇలా రెండు శివలింగాలూ కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందిందని పండితులు చెబుతున్నారు. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథస్వామి జ్యోతిర్లింగంగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు.
అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతే..
రామేశ్వరంలో మొత్తం అరవైనాలుగు బావులు ఉంటాయి. వాటిలో ఆలయంలో ఉన్న 22 అతి ప్రధానమైనవిగా చెబుతారు. రావణ సంహారం తర్వాత రాముడి అమ్ములపొదిలో మిగిలిన 22 బాణాలతోనే ఇక్కడ ఇరవైరెండు బావుల్ని సృష్టించాడనీ పండితులు చెబుతారు. ఇక్కడకు వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డునున్న అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతే ఆలయంలోపలికి వెళ్తారు.
అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింటిలో కాకపోయినా.. ఒకటి రెండింటిలో స్నానం చేసినా పుణ్యఫలం దక్కుతుందని తెలియజేస్తున్నారు. ఈ తీర్థాలన్నీ సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కోలా ఉంటుందట. కొన్ని బావుల్లోని నీరు తియ్యగా కూడా ఉంటుందట. ఈ తీర్థాలను సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల, నీల సూర్య, చంద్ర, గంగ వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.
108 శివలింగాల్నీ చూడవచ్చు :
తీర్థాల్లో పవిత్రస్నానం చేసిన తర్వాత భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత జ్యోతిర్లింగానికి పూజలు చేస్తారు. శివలింగాల దర్శనం పూర్తయ్యాక పర్వతవర్ధినిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత విశ్వేశ్వరుడు, విశాలాక్షి, విష్ణుమూర్తి, మహాలక్ష్మి, సంతాన - సౌభాగ్య గణపతి, నటరాజు, నవగ్రహ మండపం, వల్లీదేవసేన సమేత కార్తికేయుడు వంటి వివిధ దేవతా మూర్తుల్ని దర్శించుకుంటారు.
ఆలయం ప్రాకారాల్లో భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతారు. రామలింగ ప్రతిష్ఠను తెలియజేసే ఆలయం ఇక్కడ ఉంది. నంది మండపంలోని నంది విగ్రహం సుమారు 17 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆంజనేయస్వామి విగ్రహం శ్రీలంకవైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది.
లింగాభిషేకంతో ధనప్రాప్తి- సోమవారం ఇలా చేస్తే ప్రాబ్లమ్స్ పటాపంచలు! - Shivling Abhishekam Benefits
హనుమాన్ జయంతి ఎప్పుడో తెలుసా? - ఆ రోజున భక్తులు ఏం చేయాలంటే! - Hanuman Jayanti 2024 Date