Rama Ekadashi 2024 : తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒక ఏకాదశి శుక్ల పక్షంలో, మరో ఏకాదశి కృష్ణ పక్షంలో వస్తుంది. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం, ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు చేస్తూ, ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, మరణించిన తర్వాత వైకుంఠానికి మార్గం సుగమం అవుతుందని శాస్త్రవచనం. ఈ సందర్భంగా ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ఏ పేరుతో వ్యవహరిస్తారు? ఆ వ్రత విధానం గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కించే రమా ఏకాదశి
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశిగా జరుపుకుంటారు. వ్యాస మహర్షి రచించిన పద్మ పురాణం ప్రకారం రమా ఏకాదశి వ్రతం ఆచరించే వారికి శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు చేసే పనిలో ఆర్థికంగా పురోగతి లభిస్తుందని తెలుస్తోంది.
రమా ఏకాదశి ఎప్పుడు?
అక్టోబర్ 28న సోమవారం ఆశ్వయుజ బహుళ ఏకాదశి తిథి సూర్యోదయంతో ఉంది కాబట్టి ఆ రోజునే రమా ఏకాదశి వ్రతం ఆచరించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
పూజకు శుభసమయం
రమా ఏకాదశి పూజకు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శుభసమయం.
పూజా విధానం
రమా ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. ముందుగా సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ లక్ష్మీ నారాయణుల చిత్ర పటాలను గంధం కుంకుమలతో అలంకరించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు చేమంతులతో అర్చించాలి. తులసి దళాలతో అర్చిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. చక్ర పొంగలి, పరమాన్నం వంటి ప్రసాదాలను నివేదించాలి.
ఆలయ దర్శనం
ఏకాదశి రోజు సాయంత్రం ఇంట్లో యధావిధిగా పూజ చేసుకొని సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. రాత్రి భగవంతుని కీర్తనలతో, పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలి. పురాణాలలో వివరించిన ఏకాదశి వ్రత కథలను చదువుకోవాలి.
ఈ దానధర్మాలు శ్రేష్టం
రమా ఏకాదశి రోజు చేసే దానధర్మాలు విశేషమైన పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు అన్నదానం, వస్త్రదానం, జలదానం చేయడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజు గోసేవ చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
రమా ఏకాదశి వ్రత ఫలం
ఎవరైతే భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. రమా ఏకాదశి రోజు శ్రీలక్ష్మీనారాయణులను పూజించిన వారు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడమే కాకుండా తరతరాలకు తరగని సిరి సంపదలు పొందుతారు. రానున్న రమా ఏకాదశి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందుదాం. జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.