Puri Jagannath Temple History : హిందువులు అతి పవిత్రంగా భావించే 'చార్ ధామ్' పుణ్యక్షేత్రాల్లో పూరీ ఒకటి. ఇక్కడ 'చార్ ధామ్' అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ కాదు. బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా ఈ నాలుగింటిని 'చార్ ధామ్' అంటారు. ఈ నాలుగు ధామాలు దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని హిందువుల విశ్వాసం.
ప్రతి ఏటా జగన్నాధుని రథయాత్ర
ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరి జగన్నాథుని యాత్ర కన్నుల పండుగలా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ఈ యాత్రలో పాల్గొనడానికి, కళ్లారా చూడటానికి 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఈ ఏడాది జులై 7 వ తేదీన జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్నాథుని ఆలయ విశేషాలను, స్థల పురాణం గురించి తెలుసుకుందాం.
పురుషోత్తమ నగరం - శ్రీ క్షేత్రం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో పూరీ పట్టణం ఉంది. పూర్వం ఈ పట్టణాన్ని పురుషోత్తమ నగరమని, శ్రీ క్షేత్రం అని పిలిచేవారు. పురాతన కాలం నుంచి పూరీ ప్రముఖ క్షేత్రంగా కొనసాగుతోంది. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. పూరి క్షేత్రంలో వెలసిన జగన్నాథుని ఆలయాన్ని 12వ శతాబ్దంలో కళింగ రాజ్యాన్ని పరిపాలించే అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా, ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పూర్తి చేశాడని చెబుతారు. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు.
జగన్నాథుని ఆలయ చరిత్ర
ఆలయ స్థల పురాణం ప్రకారం ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, పూర్వంలో నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని అంటారు. గిరిజనుల రాజైన విశ్వావసుడు అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని పూజించేవాడంట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు.
జగన్నాథుని ఆలయానికి ఆవాలతో దారి
విద్యాపతి విశ్వావసుని కుమార్తె లలితను ప్రేమించి పెళ్లాడుతాడు. విద్యాపతి తన మామగారైన విశ్వావసుని జగన్నాధుని విగ్రహాలను చూపించమని పదేపదే ప్రాధేయపడగా చివరకు విశ్వావసుడు కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొద్దిరోజులకు అవన్ని మొలకెత్తి జగన్నాధుని ఆలయానికి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు.
అదృశ్యమైన విగ్రహాలు
జగన్నాథుని చూడటానికి ఇంద్రద్యుమ్ను మహారాజు అడవికి చేరుకునేసరికి ఆలయంలోని విగ్రహాలు అదృశ్యమవుతాయి. దీంతో నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ ఆలయంలోనే నిద్రిస్తూ ఉండేవాడు.
జగన్నాధుని స్వప్న దర్శనం
ఒకనాటి రాత్రి ఇంద్రద్యుమ్నునికి కలలో జగన్నాధుడు కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు.
దేవ శిల్పి చెక్కిన విగ్రహాలు
జగన్నాథుడు చెప్పినట్లుగా కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి కానీ విగ్రహాలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ సమయంలో సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. ఇంద్రద్యుమ్నునితో విశ్వకర్మ తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని అంటాడు. అంతేకాదు విగ్రహాలు తయారయ్యే ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. ఆ షరతుకు రాజు అంగీకరిస్తాడు.
షరతు ఉల్లంఘన - అసంపూర్ణ విగ్రహాలు
విశ్వకర్మ విగ్రహాలు తయారు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ గది నుంచి ఎలాంటి శబ్దం రాదు. రోజులు గడిచిపోతున్నా ఎలాంటి అలికిడి లేకపోవడం వల్ల అసహనానికి గురైన రాణి గుండిచాదేవి తొందర పెట్టడం వల్ల గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. రాజు తలుపు తెరిపించగానే అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి.
కనిపించని అభయహస్తం, వరద హస్తం
చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు చూసి రాజు పశ్చాత్తాపం పొంది బ్రహ్మదేవుని ప్రార్ధిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇకపై ఆలయంలో విగ్రహాలు ఇలాగే దర్శనమిస్తాయని, అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం, వరద హస్తం ఉండవు. చతుర్దశ భువనాలనూ చూడటానికా అన్నట్టు విగ్రహాలకు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.
నవ కళేబర ఉత్సవం
దేశంలో ఎక్కడ లేని విధంగా పూజలందుకుంటున్న ఈ దారు మూర్తులను ప్రతి ఎనిమిదేళ్లకు ఒకసారి కానీ, పన్నెండేళ్లకు కానీ, పంతొమ్మిదేళ్లకు ఒకసారి కానీ మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్టిస్తారు. దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు .
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.