Puri Jagannath Rath Yatra 2024 : ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే 'చార్ ధామ్' పుణ్య క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
12 రోజుల ఉత్సవం
జగన్నాథుని రథయాత్ర ఆషాడ శుద్ధ విదియ అంటే జులై 7 న ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతుంది. దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు.
భక్తుల దగ్గరకు భగవంతుడు
సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ పూరి ఆలయం రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వలన ఈ జగన్నాథ రథ యాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.
ప్రతి ఏటా కొత్త రథం
సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు.
రథ నిర్మాణం అంతా లెక్క ప్రకారమే!
పూరీ రాజు వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తారు. ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకీ, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికీ, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు.
రథ నిర్మాణం ఇలా!
తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇక జగన్నాథుడి రథాన్ని 'నందిఘోష' అని, బలభద్రుడి రథాన్ని 'తాళధ్వజం' అని, సుభద్రాదేవి రథం 'పద్మధ్వజం' అని అంటారు.
శాస్త్రోక్తంగా రథయాత్ర
ప్రతి రథానికీ 250 అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలన్ని నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లి పూజరులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే 'మనిమా (జగన్నాథా) ' అని పెద్దగా అరుస్తూ రత్న పీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకొస్తారు.
భక్తుల జై జై ధ్వనులు
ఊరేగింపులో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. అవి అందుకోవడానికి కోసం భక్తులు పోటీ పడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మ ధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు.
కమనీయం జగన్నాథుని దర్శనం
చివరగా భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకు వచ్చి నందిఘోష రథం మీద ఉంచుతారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను 'పహాండీ' అంటారు.
సర్వం జగన్నాథం
ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుని నీలమాధవుడి రూపంలో అర్చించిన విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. ఈనాటికీ ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. విగ్రహాలను తరలించే సమయంలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు.
వేడుకగా చెరా పహారా
సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను 'చెరా పహారా' అంటారు.
కస్తూరి కళ్లాపి
ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామిపై పూరీ సంస్థానాధీశులు గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే బలరాముడిని, సుభద్రాదేవిని కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇక అంగరంగ వైభవంగా జగన్నాధుడు రథ యాత్రకు సిద్ధమవుతాడు. జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి 'జై జగన్నాథా' అని బిగ్గరగా అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు.
వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుని రథం చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోష యాత్ర అంటారు. ఈ క్రమంలో రథ చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన వాటిని కూలగొట్టైనా సరే రథం ముందుకే వెళుతుంది కానీ ఆగదు.
మందగమనం
జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా మందిరానికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని 'బహుదాయాత్ర' అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి.
ముగిసిన జైత్రయాత్ర
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడం వల్ల యాత్ర పూర్తవుతుంది. యాత్ర పేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన శోభతో అలరారుతుంది. జగన్నాథుని రథయాత్ర చూడటం పూర్వజన్మ సుకృతం. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని రథయాత్ర చూసే భాగ్యం కల్పించామని ఆ జగన్నాథుని మనసారా వేడుకుందాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఆదివారమే పూరీ జగన్నాథుడి రథయాత్ర- ఆ నీలమాధవుడి ఆలయ చరిత్ర మీకోసం! - Puri Rath Yatra 2024