Paush Purnima 2024 Date and Significance: హిందూ సంప్రదాయంలో పుష్య పౌర్ణమికి ప్రత్యేకత ఉంది. ఏటా పుష్య మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి తిథి నాడు పుష్య పౌర్ణమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల ప్రకారం ఈరోజు సూర్య భగవానుడిని పూజించడం, దానధర్మాలు చేయడం, లక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి.. ఇంట్లో సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అయితే ఈ సంవత్సరం పుష్య పౌర్ణిమ ఏ రోజున వస్తుంది.. శుభ సమయం, ప్రాముఖ్యత, పూజా విధానానికి సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పుష్య పౌర్ణమి తిథి: పంచాంగం ప్రకారం.. జనవరి 25వ తేదీన పుష్య పౌర్ణమిని జరుపుకోనున్నారు. పుష్య పూర్ణిమ తిథి జనవరి 24, 2024న రాత్రి 9:49 గంటలకు ప్రారంభమయ్యి.. మరుసటి రోజు అంటే 25 జనవరి 2024 రాత్రి 11:23 గంటలకు ముగుస్తుంది. పంచాంగ ప్రకారం ఉదయం తిథిని లెక్కలోకి తీసుకుంటారు కాబట్టి.. 25న పుష్య పూర్ణిమ జరుపుకోనున్నారు. పైగా ఈ ఏడాది మొదటి పౌర్ణమి ఇది.
పుష్య పూర్ణిమ విశిష్టత: పుష్యమాసంలో పౌర్ణమి రోజు నదీస్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజున నదీస్నానం ఆచరించి శ్రీ మహాలక్ష్మీని, శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని.. ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుందని.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. కాగా, ఈ పౌర్ణమి నాడు చాలా మంది తమ ఇళ్లల్లో సత్యనారాయణ పారాయణం చేస్తారు.
పుష్య పూర్ణిమ పూజా విధానం:
- తెల్లవారుజామున నిద్రలేచి ఇళ్లు శుభ్రం చేసుకోవాలి.
- తర్వాత నదీ స్నానం చేసి సూర్య భగవానుడిని ఆరాధించాలి.
- అనంతరం పూజ గదిలో లక్ష్మీదేవి, శ్రీ మహా విష్ణువును పూజించాలి.
- పూలు ముఖ్యంగా కలువ పూలతో పూజించాలి. అలాగే పండ్లు, దీప, ధూప, నైవేద్యాలతో స్వామి, అమ్మవార్లను ఆరాధించాలి.
- లక్ష్మీదేవి శ్లోకం, కనకధార స్తోత్రం, శ్రీ సూక్త, విష్ణుసహస్త్రాణం పారాయణం చేయాలి.
- ఇక ఆరోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూట మరోసారి పూజ చేసుకోవాలి.
- ఆ తర్వాత చంద్రుడిని పూజించి.. ఉపవాసం విరమించాలి.
శాకాంబరి జయంతిగా కూడా: కొన్ని ప్రాంతాల్లో, పుష్య పౌర్ణమిని ‘శాకంబరి జయంతి’గా కూడా జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాదేవిని శాకంబరీ దేవిగా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. భూమిపై కరవు, తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి దుర్గాదేవి శాకంబరిగా అవతరించిందని విశ్వసిస్తారు. అందుకే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఈ శాకంబరి ఉత్సవాలు అష్టమి రోజు ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు అమ్మవారిని ఆకులతో అలంకరిస్తారు. దీనిని అక్కడి గిరిజనులు 'చార్తా పండుగ'(పంటల పండుగ) అంటారు.
మొదటి పౌర్ణమి రోజే ప్రత్యేక యోగాలు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇదే రోజు పునర్వసు నక్షత్రం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, గురు పుష్యా యోగాలు కలవబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దానధర్మాలు చేయడం వల్ల అనేక రకాల ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని సరైన దిశలోనే ఉంచారా? - లేదంటే ఎన్ని పూజలు చేసిన శూన్యం!