Padmavathi Brahmotsavam Chandra Prabha Vahanam Significance : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు సాయంత్రం అమ్మవారు ఏ వాహనంపై ఊరేగనున్నారు, ఆ వాహన సేవ విశిష్టత ఏమిటి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
చంద్రప్రభ వాహనంపై చంద్ర సహోదరి!
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.
చంద్రప్రభ వాహన సేవ విశిష్టత
కార్తిక బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతి దేవి ధనలక్ష్మి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. దేవ దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించిన సమయంలో అందులో నుంచి కొన్ని అద్భుతాలు ఉద్భవించాయి. చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి కూడా క్షీర సాగరం నుంచి ఉద్భవించారని పోతన రచించిన భాగవతం ద్వారా మనకు తెలుస్తోంది. అందుకే శ్రీలక్ష్మిని చంద్ర సహోదరిగా వ్యవహరిస్తారు. ఆ శ్రీలక్ష్మినే ఈ పద్మావతి దేవి.
మనశ్శాంతి రోగ నాశనం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. ఔషధాలను తేజోవంతం చేసే శక్తి కలవాడు. అందుకే చంద్రప్రభ వాహనంపై ఊరేగే చంద్ర సహోదరి శ్రీ పద్మావతి దేవిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమస్త ఔషధీ తత్వంతో రోగ నాశనం జరుగుతుంది. అంతేకాదు చంద్రప్రభ వాహనంపై ఊరేగే అమ్మవారి దర్శనంతో సకల పాపాలు తొలగి, సమస్త సంపదలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం.
చంద్రప్రభ వాహన దర్శనఫలం
క్షీరసాగరంలో సముద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే అలమేలు మంగను సేవించే భక్తులపై చంద్రశైత్య సంభరితములైన ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టి లాగా వర్షిస్తాయని, అందుకే చంద్రప్రభ వాహన దర్శనం శుభప్రదమని శాస్త్రవచనం. చంద్రప్రభ వాహనంపై విహరించే అమ్మవారిని మనశ్శాంతిని, ఆనందాన్ని ప్రసాదించమని మనసారా వేడుకుంటూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు? డిసెంబర్ 6 లేదా 7? పంచాంగ కర్తలు ఏమంటున్నారు?
సూర్యనారాయణుడిగా పద్మావతి అమ్మవారు - సూర్యప్రభ వాహనంపై విహరించేది అందుకే!