Onam Festival Significance In Telugu : వ్యాసభగవానుడు రచించిన వామన పురాణం ప్రకారం రాక్షసుల నుంచి భూమండలాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం స్వీకరించి బలి చక్రవర్తి నుంచి మూడు అడుగుల నేలను దానంగా కోరుతాడు. ఒక అడుగు భూమిపై, రెండో అడుగు ఆకాశంపై మోపిన తర్వాత మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని అడుగగా గొప్ప దానశీలి అయిన బలి చక్రవర్తి దానం కోరుతున్నది సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అని గ్రహించి మూడో అడుగు తన శిరస్సుపై వేయమని చెబుతాడు.
అయితే అంతకు ముందుగా బలి చక్రవర్తి తాను సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చేలా వరం ఇవ్వమని కోరుతాడు. అందుకు విష్ణుమూర్తి అలాగేనని వరమిచ్చి బలి చక్రవర్తిపై తన మూడవ అడుగు వేసి పాతాళానికి అణిచివేస్తాడు. ఆ విధంగా బలి చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చే సందర్భంగా కేరళ వాసులు ఓనం పండుగను జరుపుకుంటారు.
ఓనం పండుగ ఎప్పుడు?
ఓనం పండుగ ఉత్సవాలు 10 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 6 న మొదలైన ఓనం వేడుకలు 10 రోజుల పాటు సంప్రదాయంగా జరిగి సెప్టెంబర్ 15 న జరిగే తిరుఓనంతో ముగుస్తాయి.
ఓనం విశిష్టత
ఓనం పండగను కేరళ వాసులు తమ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటారు. ఓనం సందర్భంగా కేరళ ప్రజలు తమ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. బంధుమిత్రులతో పండుగ వేడుకలను ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకుంటారు. కేరళ వాసులు ఓనం పండుగను జీవితంలో ఆనందానికి, శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు.
సౌభ్రాతృత్వానికి ప్రతీక ఓనం!
ఓనం పండుగ సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు చిహ్నం. వివిధ కులాలు, మతాల ప్రజలు కలిసి కుల మత భేదం లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని పెంచే ఓనం పండుగను జరుపుకోడానికి దేశవిదేశాలలో స్థిరపడిన కేరళ వాసులు కూడా తమ సొంత రాష్ట్రానికి తిరిగి వస్తారు.
ఓనం పండుగ ఇలా!
ఓనం సందర్భంగా ప్రతి ఇంటి ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో అలంకరిస్తారు. ఇంటి ముంగిట్లో రంగురంగుల పువ్వులు, ఆకులు, పొడి బియ్యం పిండి వంటి వాటిని ఉపయోగించి అందమైన రంగవల్లులు తీర్చి దిద్దుతారు.
ఓనం సాధ్య వెరీ స్పెషల్
ఓనం పండుగ చివరి రోజు తయారుచేసే సాధ్య ఓనం పండుగలో ప్రధానమైనది. సాధ్య అంటే భోజనం. అరటి ఆకులో అవియల్, పుట్టు, అరటి చిప్స్, సాంబార్ అన్నం, కొబ్బరి పాయసం, తయ్యర్ వంటి దాదాపు 26 రకాల ఆహార పదార్ధాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఈ సాద్య ఓనం పండుగలో చాలా ప్రత్యేకమైనది.
సాంస్కృతిక కార్యక్రమాలు
ఓనం సందర్భంగా కేరళలో సాంప్రదాయ తుల్లల్ అనే జానపద నృత్యం, కథకళి వంటి సాంప్రదాయ నృత్యరీతులతో కూడిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకగా జరుగుతాయి.
పడవ పందాలు
ఓనం సందర్భంగా కేరళలో జరిగే పడవ పందాలు చూసి తీరాల్సిందే! స్థానికులు విశేషంగా పాల్గొనే ఈ పడవ పందాలు ఓనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
రంగురంగుల పూలతో కూడిన రంగవల్లులు, సాంప్రదాయ నృత్యరీతులు, సాద్య పేరుతో నోరూరించే వంటకాలు, ఉత్సాహంగా జరిగే పడవ పందేలతో కేరళలో పది రోజులు నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా కళకళలాడుతూ ఉంటుంది. ఈ ఉత్సవాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలని దేశవిదేశాల నుంచి విచ్చేసిన పర్యాటకులతో కేరళ కోలాహలంగా ఉంటుంది. వీలుంటే కేరళ ఒకసారి వెళ్లి ఓనం వేడుకలలో పాల్గొందాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.