Masa Shivratri Puja : మాస శివరాత్రి ఒక గొప్ప పుణ్య దినం. జూలై 4న అంటే గురువారం ఉదయం 9 గంటల నుంచి చతుర్దశి తిథి ఉంది. కాబట్టి మాసశివరాత్రి పూజ గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు చేసుకుంటే మంచిది.
గొప్ప విశేషం
గురువారం నాడు మాసశివరాత్రి కలిసి రావడం గొప్ప విశేషమని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే పరమశివుడు ఆది గురువని పురాణాలు, వేదాలు చెబుతున్నాయి. శివుని జన్మ తిథి చతుర్దశి గురువారం రావడం గొప్ప విశేషమని, ఈ రోజు శివుని ఆరాధిస్తే, ఆయన అనుగ్రహంతో పాటు గురువు అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
రాహు, కేతు గండాలను పోగొట్టే మాస శివరాత్రి పూజ
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జాతకంలో రాహు కేతు గ్రహాల దోషాల కారణంగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా రాహు, కేతు దోషాల కారణంగా కొన్ని ప్రాణ గండాలు ఏర్పడి మృత్యుభయం ఏర్పడవచ్చు. అందుకే ఇలాంటి గండాల నుంచి బయట పడటానికి శాస్త్రం, మాస శివరాత్రి పూజకు ప్రాధాన్యతను ఇచ్చింది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా! అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని ఆరాధించి సంపూర్ణ ఆయుష్షును పొందిన కథ మనందరికీ తెలిసిందే! అందుకే మాస శివరాత్రి రోజు శివుని నియమ, నిష్టలతో ఆరాధిస్తే ఎలాంటి గండాలైనా పోతాయి. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభిస్తుంది.
మాస శివరాత్రి పూజా విధానం
మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి, శుచియై, ఇంట్లో పూజాదికాలు ముగించుకొని శివాలయానికి వెళ్లి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజంతా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉపవాసం చేయాలి. సాయంత్రం ప్రదోష వేళలో తిరిగి స్నానం చేసి శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో, గంగా జలంతో అభిషేకం జరిపించి, అష్టోత్తర శత నామాలతో శివయ్యని అర్చించాలి. శివయ్యకు పండ్లు, కొబ్బరికాయలు, పులిహోర వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు.
మాస శివరాత్రి రోజు ఈ దానాలు శ్రేష్టం
మాస శివరాత్రి రోజు అన్నదానం కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. అందుకే ఈ రోజు వీలైనంత వరకు కనీసం ఒక్కరికైనా భోజనం పెడితే మంచిది. అలాగే ఈ రోజు జలదానం, వస్త్ర దానం, భూదానం, గోదానం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి.
మాస శివరాత్రి పూజాఫలం
మాస శివరాత్రి రోజు పరమశివుని ఈ విధంగా నియమనిష్టలతో పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మనిషి పతనానికి కారణమైన కామము, క్రోధము, దురాశ, అసూయ అనే దుర్గుణాలు నశించిపోతాయి. వృత్తికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఈ గురువారం రోజు రానున్న మాస శివరాత్రి నాడు మనమందరం కూడా శివయ్యని తగిన విధంగా పూజిద్దాం. ఇటు శివయ్య అనుగ్రహం, అటు గురువు అనుగ్రహాన్ని కూడా పొందుదాం.
ఓం నమః శివాయ
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
విష్ణుమూర్తే కాదు, శివుడు కూడా 10 అవతారాలు ఎత్తారు- వాటి గురించి తెలుసా? - Shiva Avatars Names