Karthika Puranam Chapter 12 : పవిత్ర కార్తిక మాసంలో చేసే అతి చిన్న పుణ్య కార్యమైనా అధిక ఫలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కార్తిక శుద్ధ ద్వాదశి రోజు చేసే సాలగ్రామ దానం వలన కలిగే ఫలాన్ని జనకునికి వశిష్ఠుడు ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
దాన ఫలం
వశిష్ఠుడు జనకునితో పన్నెండవ రోజు కథను ప్రారంభిస్తూ "ఓ జనక మహారాజా! కార్తిక మాసంలో చేయు దానములకు విశేష ఫలం కలదు. కార్తిక మాసంలో వస్త్రదానం, అన్నదానము, గోదానం, యజ్ఞోపవీతదానం చేయడం వలన గొప్ప ఫలము కల్గును. ఇక కార్తిక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేసిన ఎంతో పుణ్యం. ఆ మహాత్యమును వివరించే ఒక కథను నీకు చెబుతాను శ్రద్దగా వినుము" అని చెప్పసాగెను.
పిసినారి వైశ్యుని కథ
పూర్వం గోదావరీ నదీ తీరమున గల ఒక పల్లె నందు ఒక పరమ లోభి అయిన వైశ్యుడు ఉండేవాడు. అతడు తాను తినక ఇతరులకు పెట్టక దాన ధర్మములు చేయక, ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ తానే శ్రీమంతుడునన్న గర్వముతో విర్రవీగుతూ ఉండేవాడు. ఎంతసేపటికి ఇతరుల ధనమును ఎలా కాజేయాలానే కపట బుద్దితో ఉండేవాడు.
బాకీ తీర్చమని బ్రాహ్మణుని వేధించిన వైశ్యుడు
ఒకసారి అతడు తన పొరుగూరిలో ఉన్న బ్రాహ్మణునికి ఎక్కువ వడ్డీకి ధనమును అప్పుగా ఇచ్చాడు. గడువు పూర్తి అయిన తరువాత వైశ్యుడు ధనము కోసం బ్రాహ్మణుని ఇంటికి వెళ్లగా, ఆ బ్రాహ్మణుడు "అయ్యా! ఈ దినము నేను మీ బాకీ తీర్చలేను. నాకు మరికొంత గడువు ఇవ్వండి, ఎలాగైనా నేను మీ బాకీ తీర్చివేస్తాను. ఒకవేళ ఈ జన్మలో తీర్చలేకపోతే మరో జన్మలో జంతువుగా పుట్టి మీకు సేవ చేసి అయినా మీ ఋణం తీర్చుకుంటాను" అని వేడుకున్నాడు.
బ్రాహ్మణ హత్యకు పూనుకున్న వైశ్యుడు
ఆ మాటలకు కోపించిన వైశ్యుడు ఆవేశంతో తన వద్దనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతు కోసివేసాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు. ఆ సంఘటనతో భయపడిపోయిన వైశ్యుడు అక్కడే ఉంటే రాజభటులు వచ్చి తనను బంధిస్తారేమో అని భయపడి తన గ్రామానికి పారిపోయాడు.
నరకానికి పోయిన వైశ్యుడు
గ్రామానికి పారిపోయినా బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక, ఆనాటి నుంచి ఆ వైశ్యుడు కుష్టు రోగంతో బాధపడి, కొంత కాలానికి మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వానిని నరకానికి తీసుకొనిపోయి నానా బాధలు పెట్టసాగారు.
ధర్మవీరుని దాతృత్వం
ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగ్గట్లుగానే అతడు తన తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములకు, పుణ్య కార్యములకు వినియోగిస్తూ ఉండేవాడు. కొంత కాలానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి నరకము నుంచి భూలోకమునకు వెళుతూ మార్గమధ్యములో ధర్మవీరుని ఇంటికి వచ్చాడు.
ధర్మ వీరునికి సాలగ్రామ దాన మహత్యాన్ని వివరించిన నారదుడు
ధర్మవీరుడు నారద మహర్షిని విష్ణు స్వరూపంగా భావించి అర్ఘ్యపాద్యములిచ్చి సత్కరించి "ఓ మహానుభావా! తమరి రాక వలన నా ఇల్లు పావనమైంది. తమరి రాకకు గల కారణమును తెలియజేయుమని ప్రార్థించగా, అంతట నారదుడు "ఓ ధర్మవీరా! నీకు ఒక విషయమును చెప్పదలచితిని. అది ఏమనగా, పరమపవిత్రమైన కార్తిక మాసంలో వచ్చు శుద్ధ ద్వాదశి నాడు చేయు స్నానదాన, జపాలకు అత్యంత ఫలము కలదు. ముఖ్యముగా శుద్ధ ద్వాదశి రోజున ఎవరైతే సాక్షాత్తూ విష్ణు స్వరూపమైన సాలగ్రామమును దానం చేస్తారో వారికి, వారి పూర్వీకులకు జన్మజన్మల పాపం పోవును. నీ తండ్రి నరకబాధలు అనుభవిస్తూ ఉన్నాడు. కావున నీవు కార్తిక శుద్ధ ద్వాదశి నాడు, నిష్ఠగా ఉండి, సాలగ్రామమును దానం చేసిన నీ తండ్రికి నరక బాధల నుంచి విముక్తి కలుగును" అని చెప్పెను.
ధర్మవీరుని అజ్ఞానం
అంతట ధర్మవీరుడు "ఓ మునివర్యా! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి అనేక గొప్ప దానాలు చేశాను. కానీ ఒక మాములు 'రాయి' అయిన సాలగ్రామ దానం చేస్తే ఏమి ఫలం ఉంటుంది? నేను చేయను" అని చెప్పగా, ధర్మవీరుని అవివేకమునకు చింతించిన నారదుడు "ఓ ధర్మవీరా! నీవు సాలగ్రామమును ఒక రాయిగా భావిస్తున్నావు. అది సాక్షాత్తు విష్ణు స్వరూపం. నీ తండ్రికి నరకబాధలు తప్పాలంటే సాలగ్రామ దానం చేయడం తప్ప మరో మార్గం లేదు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
నారదుని మాటలు లెక్కచేయని ధర్మవీరుడు
నారదుని మాటలు పెడచెవిన పెట్టిన ధర్మవీరుడు, సాలగ్రామ దానం చేయగల శక్తి ఉండి కూడా చేయలేదు.
సాలగ్రామ దానంతో తొలగిన పాపం
ఇలా నారదుని మాటను ధిక్కరించిన పాపానికి అతడు అనేక నీచ జన్మములు ఎత్తి నరకానికి వెళ్లి చివరకు ఒక పేద బ్రాహ్మణునికి కూతురిగా జన్మించెను. ఆ బాలిక యుక్త వయసు రాగానే తండ్రి ఆమెకు తగిన వరుని చూసి పెండ్లి చేసెను. వివాహం జరిగిన కొంతకాలానికే ఆమె భర్త మరణించాడు. చిన్నవయసులోనే ఆమెకు ఇటువంటి కష్టం రావడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఆమె తండ్రి తన దివ్య దృష్టితో చూడగా, పూర్వజన్మలో నారదుని మాట ప్రకారం సాలగ్రామం దానం చేయకపోవడమే ఆమె దుస్థితికి కారణమని గ్రహించి ఒక కార్తిక శుద్ధ ద్వాదశి, సోమవారం నాడు ఆమెచే మంత్రపూర్వకంగా సాలగ్రామం దానం చేయించాడు. దానితో ఆమె భర్త తిరిగి జీవించాడు. ఎన్ని జన్మలెత్తినా చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పెద్దల మాటను జవదాటరాదు.
"కావున ఓ జనక మహారాజా! కార్తిక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన జన్మజన్మల పాపం పటాపంచలై పోతుంది" అని వశిష్ఠుడు జనకునితో చెబుతూ పన్నెండవ రోజు కథను ముగించాడు.
ఇతి స్మాంద పురాణ కార్తిక మహాత్మ్యే! ద్వాదశాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.