How to Get Rid of Poverty with Aloe vera Plant: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దరిద్రం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అంతేకాదు అది ఏ రూపంలో అయినా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముప్పుతిప్పలు పెడుతుంది. దురదృష్టం కారణంగా మనం చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఈ దరిద్రం మనల్ని కేవలం ఇంట్లోనే కాదు ఆఫీసులో లేదా ఇంకా ఇతర ప్రదేశాల్లోనూ వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రతికూల సమస్యలను అధిగమించాలంటే జ్యోతిష్యశాస్త్రం, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటించాలని.. అప్పుడే దరిద్రం తొలగిపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా కలబందతో ఇలా చేయడం వల్ల మీకు పట్టిన దరిద్రం వదిలి.. అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది తమ ఇంట్లో కలబంద మొక్క పెంచుకుంటారు. అయితే కలబందను కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసం, అందాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ, కలబందను ఉపయోగించి మనకు పట్టిన దరిద్రాన్ని కూడా వదిలించుకోవచ్చని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్కుమార్ చెబుతున్నారు.
ఈ దిక్కున ఉంటే మంచిది: పరిహార శాస్త్రంలో కలబంద చెట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉందని మాచిరాజు అంటున్నారు. అన్ని చెట్ల కన్నా ఈ కలబంద చెట్టు శ్రేష్ఠమైనదని చెబుతున్నారు. అందుకే ఈ చెట్టును ఇంట్లో ప్రత్యేక ప్రదేశంలో నాటుకుంటే దరిద్రం మొత్తం పోతుందని అంటున్నారు. ఎవరి ఇంట్లో అయినా సరే ఈశాన్యం లేదా వాయువ్యం దిక్కులో కలబంద పెంచుకోవడం మంచిదంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్నేయంలో పెంచుకోవద్దని.. ఒకవేళ పెంచుకుంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
మీ ఇంట్లో కనక వర్షం కురవాలా? - వేంకటేశ్వర స్వామిని ఈ రోజున దర్శించుకుంటే చాలు!
నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే: నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే కలబంద మొక్కను ఇంట్లో వేలాడదీయాలని మాచిరాజు కిరణ్ చెబుతున్నారు. సాధారణంగా మొక్కల వేర్లు కింద ఉంటాయి. కానీ కలబంద వేర్లు పైకి.. మొక్క కిందకు వచ్చేలా దారంతో వేలాడదీయాలని చెబుతున్నారు. అదీ కూడా మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ పని చేయాలని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల మన నడిచే సమయంలో కలబందకు మొక్కకు ఉన్న చిన్న చిన్న ముల్లులు మన జుట్టుకు తగులుతుంటాయని.. ఇలా జుట్టుకు ముళ్లు తగిలితే శని దోషాలు అన్నీ పోతాయని, లక్ష్మీ కటాక్షం కలిగి దరిద్రం వదిలిపోతుందని అంటున్నారు.
అష్టైశ్వర్యాల కోసం: శుక్రవారం సాయంత్రం ప్రదోష సమయంలో కలబంద మొక్క నుంచి తీసిని గుజ్జును శ్రీ మహాలక్ష్మీకి నైవేద్యంగా సమర్పిస్తే.. అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు కాలాన్ని ప్రదోష కాలం అంటారు. ఆ నైవేద్యంగా పెట్టిన గుజ్జును శరీరానికి రాసుకుని స్నానం చేయడం వల్ల మీకున్న అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు.
NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
విద్యార్థులకు జ్ఞానప్రదాత హయగ్రీవుడు- సోమవారం ఇలా పూజిస్తే విద్యాబుద్ధులు పక్కా!
దానాలతో సమస్త గ్రహ దోషాలు పరార్! శ్రావణ సోమవారం రోజు ఇలా చేస్తే ఎంతో మంచిది!!