Hanuman Puja Vidhanam In Telugu : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మంగళవారాన్ని జయ వారమని కూడా అంటారు. సాధారణంగా మంగళవారం కొత్తగా ఏ పనులు మొదలుపెట్టరు. అలాంటి నమ్మకం ఉన్నవారు మంగళవారం హనుమంతుని ఆరాధించి, ఆ తర్వాత పనులు ప్రారంభిస్తే ఆటంకాలు ఉండవని విశ్వాసం.
అంగారక గ్రహ దోషాలు పోగొట్టే హనుమ పూజ
మంగళవారం హనుమను పూజిస్తే అంగారక గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా సాగుతాయని, సగంలో ఆగిపోయిన పనులు కూడా ఈ పరిహారాలతో పూర్తవుతాయని నమ్మకం.
ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడటానికి మంగళవారం ఈ పరిహారాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది.
- ప్రతి మంగళవారం హనుమంతునికి ఎర్ర గులాబీల దండను సమర్పించాలి. ఇలా వరుసగా 7 మంగళవారాలు పరిహారం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు.
- మంగళవారం నాడు మట్టి కుండలో తేనె వేసి మూత పెట్టి హనుమంతుని ముందు పెట్టి మూడు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పులు లేకుండా ఉంటాయి. అప్పుల బాధల కారణంగా ఇంట్లో నెలకొన్న అశాంతి తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.
- మంగళవారం హనుమకు ప్రీతికరమైన శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. మనోబలం పెరుగుతుంది.
- మంగళవారం రోజు ఎర్ర కందిపప్పు వేయించి పొడి చేసి అందులో బెల్లం, నెయ్యి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి హనుమకు నివేదించిన తర్వాత వాటిని ప్రసాదంగా పంచి పెట్టాలి. వీలు ఉంటే గోవుకు తినిపించవచ్చు. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తులు దూరమవుతాయి. సంతోషం, సంపదలు కలుగుతాయి.
- మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్లి స్వామి విగ్రహం మీదున్న సింధూరాన్ని తిలకంగా ధరించాలి. ఇలా 11 మంగళవారాలు చేస్తే ఆర్థిక సమస్యలు పోవడమే కాదు ఐశ్వర్యప్రాప్తి కూడా కలుగుతుందని శాస్త్ర వచనం.
- మంగళవారం హనుమంతుని ఆలయంలో 21 అరటిపండ్లు స్వామికి నివేదించిన తర్వాత గుడికి వచ్చిన భక్తులకు ఆ అరటి పండ్లను ప్రసాదంగా పంచిపెడితే మొండి బాకీలు వసూలవుతాయి. ఇలా 5 మంగళవారాలు చేస్తే అప్పులు తీరిపోయి ఆర్థికంగా పుంజుకుంటారు.
శ్రీరామ భక్తుడైన హనుమంతుని పూజలో భక్తి విశ్వాసం ప్రధానం. భక్తి విశ్వాసాలతో మన ధర్మ శాస్త్రాలు, పెద్దలు చెప్పిన పరిహారాలను పాటిద్దాం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుదాం. జైశ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
బడ మంగళ్ పూజ గురించి తెలుసా? అంజన్నను అలా పూజిస్తే సమస్యలన్నీ పరార్! - Bada Mangal Puja Vidhi
హనుమజ్జయంతి ఏడాదిలో రెండు సార్లు ఎందుకు? ఎలా పూజ చేయాలి? - Hanuman Jayanti Special