Elinati Shani Pariharam In Telugu : సాధారణంగా శని దేవుడి పేరు వినగానే, ఆయన రూపాన్ని చూడగానే అందరూ ఆందోళన చెందుతారు. శని దేవుడు అనేక కష్టనష్టాలకు గురిచేస్తాడనే విషయాన్ని అందరూ విశ్వసించడమే ఇందుకు కారణం.
న్యాయాధికారిగా శని దేవుడు
నిజానికి శని దేవుడు న్యాయాధికారిగా వ్యవహరిస్తాడు. ఒక వ్యక్తి చేసిన పాప పుణ్యాలను ఫలితాన్ని ఇచ్చేది శని దేవుడే! అన్యాయంగా, అధర్మంగా ఆయన ఎవరినీ బాధించడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
ఇవి శనికి ప్రీతికరం
ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శని దేవుడికి ప్రీతికరమైన పనులను చేయడం వలన వాటి నుంచి ఉపశమనం పొందవచ్చునని శాస్త్రం చెబుతోంది. శనికి అనుగ్రహం కలిగితే పూర్తిస్థాయిలో శాంతిస్తాడు. ఇప్పుడు శనికి ప్రీతికరమైనవేమిటో తెలుసుకుందాం.
శివారాధన
శనికి అత్యంత ప్రీతికరమైనది శివారాధన. ఏలినాటి శని దోషం ఉన్నవారు ప్రతి నిత్యం శివలింగానికి జలాభిషేకం చేసి నువ్వుల నూనెతో దీపం పెట్టి, తమలపాకులో బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మాదిరి 41 రోజుల పాటు తప్పనిసరిగా చేయాలి.
పంచాక్షరీ మంత్ర జపం
ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతినిత్యం "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శనిదోషాల కారణంగా పడే సమస్యల తీవ్రత తగ్గుతుంది.
మహామృత్యుంజయ మంత్రం
ఏలినాటి శని దశ జరుగుతున్న సమయంలో అపమృత్యు భయం, అకాల మృత్యు భయం కూడా వెంటాడుతాయి. అందుకే ఏలినాటి శని దశ జరుగుతున్న వారు ప్రతినిత్యం పరమ శివుని మహా మృత్యుంజయ మంత్రాన్ని దీక్షతో, భక్తిశ్రద్ధలతో 108 సార్లు జపించడం వలన మృత్యుభయం తొలగిపోయి దీర్ఘాయువు కలుగుతుందని మార్కండేయ పురాణం ద్వారా తెలుస్తోంది.
శనివారపూజ
ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం వేకువఝామునే నిద్ర లేచి తలారా స్నానం చేసి సమీపంలోని శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో అభిషేకం జరిపించి, కొబ్బరికాయ, అరటిపండ్లు సమర్పించాలి. ప్రతినిత్యం అభిషేకం చేయలేనివారు ఇలా వారానికి ఒకసారి శనివారం నిష్టగా అభిషేకం జరిపించుకున్న శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శివారాధనకు ఈ నియమాలు తప్పనిసరి
నిత్యాభిషేకం అయినా వారానికి ఒకసారి అభిషేకం చేసుకున్నా సరే శని బాధల నుంచి విముక్తి కోరుకునేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. శివాభిషేకం జరిపించుకునే రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. మద్య మాంసాలు ముట్టరాదు. బ్రహ్మచర్యం పాటించాలి. అబద్దాలు చెప్పకూడదు. కోపావేశాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి.
ఈ దానాలు శ్రేష్టం
శనివారం అన్నార్తులకు అన్నదానం, వస్త్ర దానం, గొడుగు, చెప్పులు వంటివి దానం చేయడం ఉత్తమం.
ఈ నియమాలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో శివారాధన చేసినట్లయితే తప్పకుండా శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఓం నమః శివాయ! ఓం శనైశ్చరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
సకల బాధలను తొలగించే 'శని ప్రదోష' పూజ! ఎలా చేసుకోవాలో తెలుసా? - Shani Pradosh Puja
శని ప్రభావంతో నల్లగా మారిన హనుమాన్! ఈ ఆంజనేయుడి 'రక్ష' ఉంటే అనారోగ్యం దూరం! - Black Hanuman Temple