Do These 5 Things Every Day: భగవంతుడిని నమ్మేవారంతా.. స్వర్గం-నరకం ఉన్నాయని నమ్ముతారు. వారంతా మరణించిన తర్వాత స్వర్గానికే వెళ్లాలని కోరుకుంటారు. అయితే.. స్వర్గానికి వెళ్లాలా? నరకానికి వెళ్లాలా? అనేది.. భూమి మీద ఉన్నన్ని రోజులు మనిషి తాను చేసే కర్మలపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ పండితులు నండూరి శ్రీనివాస్ చెబుతున్నారు. స్వర్గానికి వెళ్లాలనుకునేవారు ప్రతిరోజూ ఈ 5 పనులు తప్పకుండా చేయాలని సూచిస్తున్నారు. ఆ పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. భూత యజ్ఞం: ఐదు పనులలో మొదట చేయాల్సినది భూతయజ్ఞం. మనకన్నా చిన్న ప్రాణులకు ఆహారం అందించడమే భూతయజ్ణంమని చెబుతున్నారు. ప్రతిరోజూ తెలిసో తెలియకో మన వల్ల అనేక చిన్న ప్రాణులు మరణిస్తుంటాయని.. ఆ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ భూతయజ్ఞం చేయాలని సూచిస్తున్నారు. అంటే చీమలకు పంచదార లేదా రవ్వ వేయడం, మనం వండుకున్న ఆహారాన్ని కాకులకు లేదా కుక్కలకు పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, దాహార్తిని తీర్చడం వంటివి చేయాలంటున్నారు. ఈ పనిని ప్రతిరోజూ చేయడం వల్ల నరకం నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు.
2. మనుష్య యజ్ఞం: మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతీ పనికి ఎవరో ఒకరిపై ఆధారపడి బతకాల్సిందే. అలాంటప్పుడు వాళ్లకు తోచినంత సాయం చేయడం వల్ల మంచి జరుగుతుందని అంటున్నారు. అందుకోసం మనుష్య యజ్ఞం చేయాలంటున్నారు. ఈ మనుష్య యజ్ఞంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. మొదటిది.. మన ఇంటికి వచ్చిన అతిథులను ఖాళీగా పంపించకుండా వారికి కడుపునిండా అన్నం పెట్టాలని చెబుతున్నారు. ఇక రెండోది.. పరులకు చేతనైనంత సహాయం చేయాలంటున్నారు. అయితే.. ఈ రెండింటిలో ఏది చేసినా స్వార్ధంగా ఆలోచించకుండా నిస్వార్ధంగా చేస్తే ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుందని అంటున్నారు.
3. పితృ యజ్ఞం: ఈ పనిని కూడా ప్రతిరోజూ చేయాలంటున్నారు. ఎందుకంటే మనం జన్మించడానికి, జీవించడానికి కారకులైన వారిని గౌరవించాలంటున్నారు. ఇందులో కూడా పలు మార్గాలు ఉన్నాయని నండూరి శ్రీనివాస్ అంటున్నారు. మొదటిది.. బతికున్నప్పుడు ప్రతిరోజూ తలిదండ్రులతో కాసేపు సమయం గడపాలని అంటున్నారు. ఒకవేళ దూరంగా ఉన్నా ఫోన్లు చేసి మాట్లాడమని చెబుతున్నారు. ఇక రెండోది.. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కర్మలు చేయాలని సూచిస్తున్నారు.
4. ఋషి యజ్ఞం: ఋుషులను గౌరవించడం నాలుగో పని. ఇందులో కూడా రెండు ఉన్నాయి. మొదటిది ఋుషులు రచించిన కొన్ని వ్యాసాలు లేదా శ్లోకాలను రోజులో కొద్దిసేపు చదవడం మంచిదంటున్నారు. రెండోది.. గురుపూర్ణిమ వంటి పండగల రోజున వారికి పూజలు చేయమంటున్నారు. వీటిని ప్రతిరోజూ చేయడం మంచిదని చెబుతున్నారు.
5. దైవ యజ్ఞం: ప్రతిరోజూ దైవయజ్ఞం చేయమని చెబుతున్నారు నండూరి శ్రీనివాస్. దీనిని మూడు విధాలుగా చేయవచ్చని చెబుతున్నారు. అందులో మొదటిది.. ప్రతిరోజూ ఓ 10 నిమిషాలపాటు హోమం చేయాలని చెబుతున్నారు. రెండోది భగవంతుడు మనకు ఇచ్చిన వాటికి కృతజ్ఞతగా ఓ 15 నిమిషాలు పూజ చేయమని సలహా ఇస్తున్నారు. వీటితోపాటుగా.. మన చుట్టూ ఉన్నవారిలో భగవంతుడిని చూడాలని చెబుతున్నారు. ఇవి పాటిస్తే.. నరకానికి కాకుండా.. స్వర్గానికి వెళ్తారని చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవీ చదవండి:
శ్రావణ శుక్రవారం స్పెషల్- కొల్హాపుర్ మహాలక్ష్మి టెంపుల్ గురించి ఈ విషయాలు తెలుసా?
కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత 'చింతామణి' గణపతి క్షేత్రం- ఎక్కడ ఉందో తెలుసా?