TTD Latest Updates on Devotees Rush: ప్రస్తుతం పిల్లలూ, పెద్దలూ వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అందులో భాగంగా ఎక్కువగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. మరి మీరు కూడా అదే ప్లాన్లో ఉన్నారా? అయితే మీకో ముఖ్య గమనిక. అదేంటో ఇప్పుడు చూద్దాం..
తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమలేశుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుమల రద్దీగా మారింది. కొండపై గత మూడు రోజులుగా కొనసాగుతున్న రద్దీ.. ఆదివారం, సోమవారం కూడా కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా విద్యార్థులకు అన్ని పరీక్షలు పూర్తి కావడంతో పాటుగా వాళ్లు కూడా తిరుమలకు వస్తున్నారు. అలాగే ఏటా మే నెలలో కచ్చితంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్ర, శని, ఆదివారాలు కావడంతో ఇది మరింత పెరిగింది. నేటికీ(సోమవారం మే 20) కూడా రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. కాబట్టి తిరుమల వెళ్లాలనుకున్న భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్లాన్ చేసుకోవాలి.
సౌకర్యాలపై ఆరా: పెరిగిన రద్దీ కారణంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే అన్నప్రసాదం, ఇంజినీరింగ్, ఆరోగ్యం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరాయంగా కొనసాగేలా చూస్తున్నారు. ప్రధానంగా తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటుగా.. కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, తాగునీరు, పాలు అందించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
తిరుమలలో ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు: ఇదిలా ఉండగా తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వచ్చారు. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.