Dattatreya Pooja Benefits : త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి ఆరాధనకు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యం ఉంది. భక్త సులభుడు అయిన దత్తాత్రేయ స్వామి ఆరాధన వలన జ్ఞానం, కీర్తి ,ఆరోగ్యం, సంపద వంటివన్నీ లభిస్తాయని శాస్త్ర వచనం. ముఖ్యంగా గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధనకు ఎంతో విశేషమైనది. దత్తాత్రేయ స్వామిని ఎలా ఆరాధించాలి, ఎలా పూజిస్తే స్వామి అనుగ్రహాన్ని పొందగలమో తెలుసుకుందాం.
అత్రిఅనసూయల కోరిక మేరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ అంశాలతో వారికి వర పుత్రుడుగా జన్మించారు. అనసూయ మాత పాతివ్రత్యాన్ని, అత్రి మహర్షి నియమ నిబద్ధతకు త్రిమూర్తులు వారికి దాసోహమై తమను తాము సమర్పించుకున్నారు. దత్త అనే పనికి సమర్పించుకోవడం అనే అర్థం ఉంది. త్రిమూర్తుల స్వరూప వర పుత్రుడు కాబట్టి 'దత్త' అని, అత్రి మహర్షి సంతానం కాబట్టి 'ఆత్రేయ' అని రెండూ కలిపి దత్తాత్రేయ స్వామి అయ్యాడు.
అనీర్వచనీయం దత్తాత్రేయ స్వరూపం
దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు. మూడు తలలు, ఆరు చేతులతో, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు ధరించి తన వెంట నాలుగు శునకాలు, గోమాతను వెంట బెట్టుకొని అవధూత లాగా కనిపించే దత్తాత్రేయ స్వామి ఘోటక బ్రహ్మచారి. దత్తాత్రేయ స్వామిని సన్యాసి అని కూడా కొందరు అంటారు. దత్తాత్రేయ స్వామి వెంట ఉండే గోమాత గాయత్రీ దేవి స్వరూపమనీ, నాలుగు శునకాలు నాలుగు వేదాల స్వరూపమనీ పెద్దలు అంటారు.
ఈ ఒక్క దేవుడిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే!
దత్తాత్రేయ స్వామిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే! దత్తాత్రేయ స్వామి పూజ వలన దత్తుని అనుగ్రహంతో పాటు త్రిమూర్తుల అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు.
గురువారం దత్తాత్రేయ స్వామిని ఇలా పూజించాలి
గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ స్వామికి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి గంధంతో బొట్టు పెట్టాలి. స్వామికి పసుపు రంగు పువ్వులతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. సమయం కుదిరిన వారు దత్తాత్రేయ స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వజ్రకవచం కానీ చదువుకుంటే ఎంతటి భయంకరమైన అనారోగ్య సమస్యలైనా పారిపోతాయి. పూజ పూర్తి అయ్యాక స్వామికి నివేదనగా పసుపు రంగు పండ్లను కానీ పసుపు రంగు ఆహార పదార్థాలు కానీ సమర్పించాలి. ఉండగలిగిన వాళ్ళు ఈ రోజు ఉపవాసం ఉండవచ్చు. వీలును బట్టి దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శిస్తే మంచిది.
దేవాలయంలో ఇలా!
ఇంట్లో పూజ చేయడం కుదరని వారు దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్లి స్వామికి పసుపు రంగు పూలను సమర్పించాలి. అలాగే స్వామికి నైవేద్యంగా పసుపు రంగు పండ్లను సమర్పించాలి. దేవాలయంలో ప్రశాంతంగా కూర్చొని దత్తాత్రేయ స్వామి చరిత్ర అయిన గురు చరిత్రను పారాయణ చేయాలి.
ఐదు కీలకం
గురువుకు ఐదు సంఖ్య ఎంతో కీలకం కాబట్టి నియమ నిష్టలతో దత్తాత్రేయ స్వామిని ఐదు గురువారాలు పూజిస్తే సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, జ్ఞానం కలుగుతాయి.
భక్తునికి కఠిన పరీక్షలు
దేవతలకు, మహర్షులకు జ్ఞానాన్ని బోధించిన దత్తుడు తన భక్తులను ఎన్నో కఠిన పరీక్షలకు గురి చేస్తాడని మహర్షులు అంటారు. ఆ పరీక్షలు తట్టుకొని నిలబడినవారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
గురువే దైవం
ఏ వ్యక్తికైనా జీవితంలో స్థిరత్వం, ఐశ్వర్యం, పదవీయోగం రావాలంటే గురువు అనుగ్రహం అవసరం. భగవంతుని అనుగ్రహం కావాలంటే ముందుగా గురువు అనుగ్రహాన్ని పొంది తీరాల్సిందే! అందుకే మన ధర్మశాస్త్రం గురువుకు పెద్ద పీట వేసింది.
గురువును పూజిద్దాం. సకల మనోభీష్టాలు నెరవేర్చుకుందాం.
ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.