Dattatreya Avatar Significance : మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునే దత్త జయంతి రోజు దత్తాత్రేయుని భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత దత్తాత్రేయుడు ఎవరు? దత్త జయంతి విశిష్టత ఏమిటి? అనే అంశాలను తప్పకుండా తెలుసుకోవాలి. త్రిమూర్తి స్వరూపంగా దత్తుని ఆవిర్భావం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
త్రిమూర్తి స్వరూపం దత్తాత్రేయుడు
మార్గశిర మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి దత్తుని భక్తులకు పరమ పవిత్రమైనది. ఈ రోజు దత్తాత్రేయుని అవతారం సంభవించింది కాబట్టి ఈ రోజు దత్తాత్రేయుడిని పూజించడం వల్ల జీవనం పావనం అవుతుంది.
లోకకల్యాణార్థం కలహభోజనుడి లీల
దత్తాత్రేయ స్వామి అవతార గాథ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారదుడు లోకకళ్యాణార్థం కోసం చేసిన మాయలో భాగంగా అనసూయ మాత పాతివ్రత్యాన్ని గురించి లక్ష్మి సరస్వతి పార్వతి దగ్గర గొప్పగా చెప్పాడంట! దాంతో ఆ ముగ్గురమ్మలు అకారణంగా అనసూయ మీద అసూయను పెంచుకుంటారు. ఎంతటి దేవతలకైనా ఈర్ష్య, అసూయ కలిగితే ఎలాంటి కష్టాల పాలవుతారో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్లుగా చెబుతుంది. దత్తుని అవతారానికి నాంది పలుకుటకై నారదుడు మొదలు పెట్టిన ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో చూద్దాం.
భూలోకానికేగిన త్రిమూర్తులు
ఈర్ష్యాసూయలతో లక్ష్మి సరస్వతి పార్వతులు తమ భర్తలైన త్రిమూర్తులను అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిని పెట్టారు ససేమిరా అన్నారు. ఇంక చేసేది లేక త్రిమూర్తులు సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతం చేరుకుంటారు. వారి పాద స్పర్భకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు పండ్లు నేలకురాల్బాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. సుందరమైన ప్రకృతి ఒడిలో ఆశ్రమ బాలకులు ఆనందంగా ఆడుకుంటున్నారు. ఆశ్రమ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైన త్రిమూర్తులు తాము కూడా ఆశ్రమ బాలల వలే ఆడుకుంటే ఎంత బాగుంటుందో కదా అని అనుకున్నారంట!
ఆశ్రమ ప్రవేశం - అత్రి అనసూయల అతిథి సత్కారం
ఒక్కసారిగా వారు తన్మయత్వం నుంచి తేరుకొని దివ్య తపో తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని, మహా సాధ్వి అయిన అనసూయను చూసి ముగ్ధులయ్యారు. ఆ పుణ్య దంపతులు సన్యాసి రూపాలలో ఉన్న త్రిమూర్తులను లోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం "మీరు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. మాకెంతో సంతోషంగా ఉంది. ఈ రోజు మా ఆశ్రమంలో భోజనం చేయండి" అని కోరారు. అందుకు అంగీకరించిన త్రిమూర్తులు భోజనానికి సిద్ధమయ్యారు.
త్రిమూర్తుల వింత కోరిక - దిక్కు తోచని అనసూయ
అత్రి మహర్షితో కలసి ముగ్గురు సాధవులు భోజనానికి ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయను సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులు ఒక షరతు విధించారు. అనసూయ వివస్త్రయై వడ్డిస్తే తప్ప తాము భోజనం చేయమని పట్టుబట్టారు.
త్రిమూర్తుల ఆంతర్యం కనిపెట్టిన అనసూయ
సాధువులు విధించిన షరతు విని అనసూయకు శిరస్సున పిడుగు పడినట్లు అయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. ఆమె పాతివ్రత్య మహత్యంతో కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులని తెలుసుకుంది. వారి ఆంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యం. ముల్లోకాలను ఏలే త్రిమూర్తులను సంతృప్తి పరచే భాగ్యం కలుగనుంది కదా అని ఆలోచించింది.
ఏకకాలంలో రెండు ధర్మాలు"
సంకట స్థితిలో ఉన్న అనసూయ ఒక ప్రక్క పాతివ్రత్యం మరోవైపు అతిథిసేవ. ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలా? అనుకుంటూ పతికి నమస్మరించి 'ఓం శ్రీపతి దేవాయ నమః' అంటూ కమండలోదకమును ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలుర య్యారు. వెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగు చాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది.
త్రిమూర్తులకు జోల పాడిన ఋషి కన్యలు}
ఇంతలో ఋషి కన్యలు మెత్తని పూల పాన్పుతో కూడిన ఊయలలో త్రిమూర్తులను ఉంచగా అనసూయ వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది. ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒకసారి తొట్రుపడి మరలా తేరుకుని, తన దివ్య దృష్టితో జరిగినది, జరగబోతున్నది తెలుసుకున్నాడు.
భూలోకానికి పయనమైన ముగ్గురమ్మలు
ఇటు స్వర్గంలో లక్ష్మీ సరస్వతి పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమం నందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ ద్వేషాలు పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి నిజ స్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు.
అనసూయను పతిభిక్ష కోరిన ముగ్గురమ్మలు
అత్రి అనసూయ దంపతులు ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖాసీనులను చేసింది. లక్ష్మి సరస్వతి పార్వతి పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకుని పతి భిక్ష పెట్టమని అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్లంి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్ర ధారులను ఎవరు ఎవరో గుర్తు పట్టలేకపోయారు.
త్రిమూర్తులకు నిజరూపాలు
ఆ సమయంలో కనువిప్పు కలిగిన లక్ష్మి సరస్వతి పార్వతి అనసూయతో "తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చెయ్యాలని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వ స్వరూపాలు ప్రసాదించమని" వేడుకుంటారు. అనసూయ మాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పుత్ర వాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు.
త్రిమూర్తుల అంశతో ఆవిర్భవించిన దత్తాత్రేయుడు
త్రిమూర్తులను చూసి అత్రి అనసూయ దంపతులు "నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యం భాగ్యాన్ని మాకు మీరు గా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతుల్లారా! మీ పుత్ర వాత్సల్యానికి మీకు మేము ముగ్గురం దత్తమవుతున్నాము. మీ కీర్తి ఆచంద్రతారార్కం కాగలదని వరమిచ్చి అంతర్దానం అయ్యారు. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయల బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను దత్త నారాయణునికి ఇస్తారు. అప్పటి నుండి ఆ స్వామి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతార లీలలు ఆరంభించారు. పుణ్యప్రదమైన శ్రీ దత్త జయంతి నాడు దత్తావతారం గురించి కథను చదివినా విన్నా సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.