Vaikuntha Chaturdashi 2024 : పరమ పవిత్రమైన కార్తిక మాసంలో ప్రతి రోజూ ఓ ప్రత్యేక విశిష్టత కలిగి ఉంటుంది. ప్రత్యేకించి శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ ఐదు తిథులను పంచపర్వాలని అంటారు. మాసం మొత్తం పూజలు చేయలేని వారు కనీసం ఈ ఐదు రోజుల్లో కార్తిక మాస పూజలు చేస్తే చాలు మాసం మొత్తం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. కార్తిక పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి తిథికే వైకుంఠ చతుర్దశి అని పేరు. ఈ సందర్భంగా కార్తిక శుద్ధ చతుర్దశి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వైకుంఠ చతుర్దశి అంటే?
కార్తికమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ద చతుర్దశి తిథినే వైకుంఠ చతుర్దశి అంటాం. ఈ రోజున విష్ణుమూర్తితో పాటూ శివుడిని కూడా తప్పకుండా పూజించాలి. అలా పూజిస్తే జన్మరాహిత్యం, మోక్షం పొందగలమని శాస్త్రవచనం.
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు?
ఈ ఏడాది నవంబర్ 14వ తేదీ ఉదయం 7:45 గంటల నుంచి చతుర్దశి తిథి ఉంది. అందుకే ఈ రోజునే వైకుంఠ చతుర్దశి పర్వదినం జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. సాధారణంగా చతుర్దశి తిథి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే ప్రత్యేకించి ఈ వైకుంఠ చతుర్దశి తిథిని శివకేశవులకు ఇద్దరికీ సంబంధించిన తిథిగా చెప్పవచ్చు.
వైకుంఠ చతుర్దశి పూజకు సుముహూర్తం
వైకుంఠ చతుర్దశి వ్రతాన్ని చేసేవారు రాత్రి కాలంలో విష్ణుమూర్తిని పూజించాలి. అదే శివారాధన చేయాలనుకునేవారు మాత్రం ఉదయం సమయంలో శివుని పూజించాలి. అందుకే శివపూజకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయం. విష్ణు పూజకు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయం.
వైకుంఠ చతుర్దశి విశిష్టత
శ్రీనాథ మహాకవి రచించిన కాశీ ఖండంలోని కాశీక్షేత్ర మహాత్యంలో ప్రత్యేకించి ఈ వైకుంఠ చతుర్దశి తిథి గురించిన ప్రస్తావన ఉంది. ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తే స్వయంగా వైకుంఠం నుంచి దిగి వచ్చి భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన కాశీ క్షేత్రంలోని విశ్వనాథ లింగానికి అభిషేక అర్చనాదులను నిర్వహించి వెళతారు. అంతేకాదు వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం ఈ రోజునే ఈశ్వరుడు, విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని ఆయుధంగా ఇచ్చాడని తెలుస్తోంది. అందుకే ఈ రోజున శివకేశవులను పూజించడం అత్యంత శుభప్రదంగా చెబుతారు.
వైకుంఠ చతుర్దశి శివ పూజా విధానం
ఈ రోజు సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేసి శుచియై శివ లింగాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. అనంతరం శివుని సహస్ర బిల్వదళాలతో అర్చించాలి. ధూప దీప దర్శనం తరువాత కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు విశేషంగా శివుని విభూతితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
వైకుంఠ చతుర్దశి విష్ణు పూజా విధానం
వైకుంఠ చతుర్దశి రోజు సాయంకాల సమయంలో విష్ణువును పూజించడం సంప్రదాయం. ఈ రోజు విష్ణువును ఇంట్లో కానీ, ఆలయంలో కానీ సహస్ర కమలాలతో అర్చించడం అత్యంత శుభకరం. సహస్ర కమలాలతో శ్రీ మహావిష్ణువును సహస్రనామాలతో అర్చించి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాదు ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీ కళ్యాణం జరుపుకోలేకపోయారో వారు ఈ రోజున విశేషించి సాయంత్రం చతుర్దశి తిథి ఉన్న సమయంలో తులసీ వివాహం చేసుకోవచ్చు.
దీపదానం
వైకుంఠ చతుర్దశి రోజు విష్ణువు ఆలయం లేదా శివాలయంలో దీపదానం చేయడం విశేషంగా చెప్పవచ్చు. అందులోనూ రాగి లేదా, ఇత్తడి లోహాలతో తయారు చేసిన కుందుల్లో దీపాలను వెలిగించి, వాటిని బ్రాహ్మణుడికి దక్షిణా పూర్వకంగా, మంత్రపూర్వకంగా దీపదానం చేస్తే మరుజన్మ ఉండదని పురాణ వచనం. ఈ విధంగా చేయడం వల్ల పూర్వజన్మలో, ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలిగిపోయి సమస్త శుభాలూ చేకూరుతాయని విశ్వాసం. రానున్న వైకుంఠ చతుర్దశి రోజు మనం కూడా శివకేశవులను పూజించి సకల శుభాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ! ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.