Chintpurni Temple History : చింతపూర్ణి ఆలయం హిమాలయాలలోని శక్తిపీఠాలలో ఒకటి. దక్షయజ్ఞంలో సతీదేవి మరణం తర్వాత జరిగిన శివతాండవం సమయంలో సుదర్శన చక్రంతో సతీదేవి శరీరం ముక్కలై ఒక్కో భాగం ఒక్కో ప్రదేశంలో పడింది. సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా మరి ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారాయి. ఆలా అమ్మవారి పాదాలు పడిన ప్రదేశమే చింతపూర్ణి ఆలయం.
చింతపూర్ణి ఆలయం ఎక్కడ ఉంది?
హిమాచల్ ప్రదేశ్లోని ఉనా నుంచి 47 కి.మీ. దూరం లో సొలా సింఘి పర్వత శ్రేణులలో పర్వత శిఖరంపైన సుమారు 3,117 అడుగుల ఎత్తులో చింతపూర్ణి అమ్మవారి ఆలయం వుంది.
పిండి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు
ఇక్కడ అమ్మవారు పిండి రూపంలో దర్శనమిస్తారు. పిండి అంటే లింగాకారంలో ఉన్న రాయి కానీ చెక్క కానీ అని అర్ధం. ఇక్కడ అమ్మవారికి శిరస్సు ఉండదు. ఇక్కడకి వచ్చిన భక్తులు అమ్మవారిని తమ చింతలు దూరం చేసే తల్లిగా కొలుస్తారు. ఈ సత్యం చాలా మందికి అనుభవ పూర్వకంగా రుజువైయింది.
చిన్ మస్తికా దేవి
చిన్ అంటే 'లేకుండుట' మస్తిక అంటే 'తల'. శిరసు లేని దేవి కాబట్టి ఈ తల్లిని చిన్మస్తిక దేవి అని అంటారు. ఇక్కడ ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. మార్కండేయ పురాణం ప్రకారం చండీదేవి అసురులను సంహరించినప్పుడు అందులో సాయపడిన ఢాకిని, యోగినిగా పిలుచుకునే జయ విజయులు ఎంతోమంది రాక్షసులను సంహరించి వారి రక్తాన్ని త్రాగినా వారి దాహం తీరదు. అప్పుడు అమ్మవారు వారి దాహాన్ని తీర్చడానికి తానే స్వయంగా తన శిరస్సును ఖండించుకొని ఆ రక్తంతో వారి దాహాన్ని తీర్చిందంట! అందుకే ఇక్కడ అమ్మవారికి శిరస్సు ఉండదని అంటారు.
సావన్ ఉత్సవాలు
ప్రతి ఏడాది జూలై ఆగస్టు మధ్య 10 రోజులపాటు ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వీటినే అష్టమి ఉత్సవాలు అని కూడా అంటారు. ఇక్కడి అమ్మవారి మహిమల గురించి తెలిసి ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు. శ్రావణ మాసంలోను, దసరా నవరత్రులలోను కార్తీక మాసంలోను, చైత్ర మాసంలోను, పౌర్ణమికి ఇంకా ఇతర పర్వ దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు.
ఆలయంలో ఈ నియమాలు తప్పనిసరి
అమ్మవారి దర్శనం కోసం గర్భాలయంలోకి ప్రవేశించే వారు తప్పనిసరిగా తల మీద షాల్ కానీ, కర్చీఫ్ కానీ, టోపీ కానీ ధరించాలి. స్త్రీలు కూడా తలపై కొంగును కప్పుకోవాలి. సంప్రదాయ దుస్తులు ధరించాలి. తోలుతో తయారుచేసిన బెల్టులు, బ్యాగులు, పర్సులు అనుమతించరు. మద్యమాంసాలు సేవించి అమ్మవారి దర్శనానికి వెళ్లకూడదు.
చింతలు తీర్చే చింతపూర్ణి
ఎత్తైన కొండలు, అగాధమైన లోయలతో ముగ్ధ మనోహరమైన ప్రకృతి రామణీయతల మధ్య నెలకొని ఉన్న చింతపూర్ణి ఆలయంలో అమ్మవారిని ఒక్కసారి దర్శిస్తే చింతలన్నీ దూరమవుతాయని భక్తుల విశ్వాసం. మనమందరం కూడా ఈ ఆలయాన్ని దర్శిద్దాం. తరిద్దాం. జై మాతా దీ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.