Mahalaya Amavasya 2024: ఎప్పుడైనా సరే గ్రహణాలు ఏర్పడిన సమయంలో తద్దినం, పిండ ప్రదానం, పితృకర్మలు ఆచరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. మరి అలాంటిది ప్రత్యేకించి పితృ కార్యాలు చేసే మహాలయ అమావాస్య రోజున(అక్టోబర్ 2) సూర్య గ్రహణం ఉంది. ఇలాంటి గ్రహణ సమయంలో పితృ కార్యాలకు ఇది ఆటంకంగా మారుతుందా? అని చాలా మందిలో సందేహం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నిట్టల ఫణి భాస్కర్. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శాస్త్రాల ప్రకారం ఒక గ్రహణం ప్రభావం.. అది కనిపించిన ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి.. మన దేశంలో నివసించే వారు ఎవ్వరూ దీని ప్రభావానికి గురికాము. అందువల్ల ఈ గ్రహణం నియమాలను మనం ఆచరించాల్సిన అవసరం లేదు. దీని ప్రభావం మనపైన లేదు కాబట్టి మహాలయ అమావాస్యకు ఈ సూర్య గ్రహణానికి ఎలాంటి సంబంధమూ ఉండదు. అందుకే ఈ రోజున చేసే పితృ కార్యాలను ఆచరించవచ్చు. దానిలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
--నిట్టల ఫణి భాస్కర్, ప్రముఖ జ్యోతిష్య నిపుణులు
సూర్యగ్రహణం ఎప్పుడు?
భారతదేశ కాలమానం ప్రకారం.. అక్టోబర్ 2 రాత్రి 9.12 గంటల ప్రవేశించి తెల్లవారుజామున 3.17 నిమిషాలకు సూర్య గ్రహణం పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కంకణాకరంలో (రింగ్ ఆఫ్ ఫైర్) చాలా అందంగా రాబోతుందని తెలిపారు. ఇది కేవలం చిలీ, అర్జెంటీనా, పెరూ లాంటి దక్షిణ అమెరికా దేశాల్లో మాత్రమే కనిపిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో.. సూర్య గ్రహణ ప్రభావం ఆ దేశాల్లోనివారిపైనే ఉంటుందని నిట్టల ఫణి భాస్కర్ చెబుతున్నారు. ముఖ్యంగా కన్యా రాశిలో కేతు గ్రస్థమై రాబోతుంది కాబట్టి.. ఆ దేశాల్లో ఉన్న కన్య, మిధున, కుంభ. తుల రాశివారు దీనిని చూడకూడదని వివరించారు. ఈ రోజున దానం సంకల్పానికి సంబంధించిన కార్యాలు చేయాలని సూచించారు. ఇందుకోసం ఒక రాగి పాత్రలో ఉలవలు, కొన్ని గోధుమలు తీసుకుని, ఒక చిన్న వెండి సూర్య బింబం, సర్పం ప్రతిమను సంకల్పం చెప్పుకుని దానం ఇస్తే ఈ గ్రహణం దోషం తొలగిపోతుందని వివరించారు.
Note : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
పెద్దలకు బియ్యం ఇస్తున్నారా? కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే! - Mahalaya Amavasya 2024
మహాలయ అమావాస్య నాడు ఈ కర్మలు చేస్తే చాలు! పితృదోష విముక్తి ఖాయం! - Mahalaya Amavasya Rituals