Batuk Bhairav Jayanti 2024 : జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున బతుక్ భైరవ జయంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 16వ తేదీన జరుపుకోనున్న బతుక్ భైరవ జయంతిని ఎక్కువగా ఉత్తరభారతంలో జరుపుకుంటారు. వసుధైక కుటుంబమైన మన దేశంలో అన్ని ప్రాంతాల వారు అన్ని చోట్ల స్థిరపడి ఉన్నారు. వారందరి కోసమే ఈ ప్రత్యేక కథనం.
ఏ దేవుని పూజించాలి
బతుక్ భైరవ జయంతి రోజు పరమశివుని ఉగ్ర రూపమైన భైరవుని పూజించాలి. ఈ రోజు పరమశివుడు భైరవుడిగా అవతరించాడు. అందుకే ఈ రోజు భైరవ పూజను చేయాలి. శివ పురాణం ప్రకారం భైరవుడు శంకరుడు వేరు వేరు కాదు అనీ, శివుని సంపూర్ణ స్వరూపమే భైరవుడు అని తెలుస్తోంది. బతుక్ భైరవుని పూజిస్తే శత్రువుల కుట్రల తిప్పికొట్టే సమర్ధతో పాటు శత్రుజయం కలుగుతుందని శాస్త్ర వచనం.
బతుక్ భైరవ జయంతి వెనుక ఉన్న పురాణగాథ
పూర్వంలో ఆపద్ అనే రాక్షసుడు చాలా కఠోరమైన తపస్సు చేసి అమరుడయ్యాడు. దేవతలు, మానవుల ద్వారా చావు లేకుండా వరం పొందాడు. కేవలం ఐదు సంవత్సరాల బాలుని చేతిలో మాత్రమే అతనికి చావు కలిగేలా వరం ఉంది. ఆ గర్వంతో దేవతలను, మానవులను వేధించడం ప్రారంభించాడు. రోజు రోజుకు ఆ రాక్షసుని ఆగడాలు మితిమీరిపోతుంటే దేవతలంతా ఒకచోట సమావేశమై ఆపద్ నుంచి రక్షించే వాడు శివుడు ఒక్కడే అని పరమేశ్వరుని వద్దకు వెళ్లి ప్రార్ధిస్తారు.
పసి బాలునిలా పరమేశ్వరుడు
దయాళుడైన ఆ పరమేశ్వరుడు తన అంశతో ఐదేళ్ల బాలునిలా జన్మిస్తాడు. ఆ బాలునికి బతుక్ భైరవ అని పేరు పెడతారు. ఈ బాలుడు ఆపద్ రాక్షసుని సంహరించి దేవతలకు, మానవులకు ఉపశమనం కలిగిస్తాడు.
బతుక్ భైరవ జయంతి పూజ ఎలా చేయాలి?
బతుక్ భైరవ జయంతి రోజు భైరవుని వాహనమైన కుక్కను పూజించాలి. ఈ రోజు ఈ పరిహారాలు చేస్తే విశేషమైన ఫలం ఉంటుంది.
నల్లకుక్కకు పూజ
బతుక్ భైరవ జయంతి రోజు నల్ల కుక్కకు ఆవ నూనెతో కాల్చిన రోటీలను, ఇతర ఆహార పదార్ధాలను తినిపిస్తే శనిదోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుక్కకు ఆహార పదార్థాలు తినిపించేటప్పుడు 'ఓం బతుక్ భైరవాయ నమః' అని అంటూ తినిపించాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది.
శివ పూజ
జాతకంలో అశుభ ఫలితాలను తొలగించుకోడానికి బతుక్ భైరవ జయంతి రోజు పరమశివుని పూజించాలి. ఈ రోజు శివునికి ఆవు పాలతో అభిషేకం జరిపిస్తే సకల మనోభీష్టాలు నెరవేరుతాయని శాస్త్ర వచనం.
కార్యజయం - శత్రునాశనం
బతుక్ భైరవ జయంతి రోజు భైరవునికి తెల్లని పూలు, అరటిపండ్లు, లడ్డూలు, పాయసం, పంచామృతాలు సమర్పిస్తే పరమశివుని అనుగ్రహంతో కార్యజయం, శత్రునాశనం ఉంటాయి.
అన్నదానం - మహాదానం
బతుక్ భైరవ జయంతి రోజు ఆవనూనెతో తయారు చేసిన మినప గారెలు, పకోడీలు, పూరీలు వంటివి వృద్ధులకు, పేదలకు, దేవాలయం వెలుపల ఉండే అన్నార్తులకు పంచాలి. ఇలా చేయడం వలన ఏలినాటి శని దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు అంటారు. ఎవరైతే జాతకంలో శని దోషంతో ఇబ్బందులు పడుతుంటారో వారు బతుక్ భైరవ్ జయంతి రోజున ఈ పరిహారాలు పాటించి సమస్యలు తొలగించుకొని సుఖశాంతులను పొందాలని కోరుకుందాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.